బుడమేరు గండ్ల పూడ్చివేత.. స్వయంగా రంగంలోకి లోకేష్
విజయవాడను ముంచెత్తిన వరదకు కారణమైన బుడమేరు వాగుకు పడిన గండ్లను పూడ్చేందుకు ఏపీ సర్కారు యుద్ధప్రాతిపదికన ముందుకు కదిలింది.
By: Tupaki Desk | 4 Sep 2024 6:11 PM GMTవిజయవాడను ముంచెత్తిన వరదకు కారణమైన బుడమేరు వాగుకు పడిన గండ్లను పూడ్చేందుకు ఏపీ సర్కారు యుద్ధప్రాతిపదికన ముందుకు కదిలింది. ఇప్పటికే నాలుగు రోజులు ఆలస్యమైనప్పటికీ.. ఇప్పుడు మరింత ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించడంతో సర్కారు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు ఈ గండ్లు పూడ్పించే బాధ్యతను నేరుగా మంత్రి నారా లోకేష్‌కే అప్పగించారు. ఆ వెంటనే నారా లోకేష్.. రంగంలోకి దిగారు.
బుడమేరు వరద ప్రవాహంలో నడుస్తూ.. గండ్లు పడిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే అధికారులతో సమీక్షించి.. గండ్లు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుడమేరు కుడివైపు, ఎడమవైపు పడిన గండ్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూడ్చి వేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరోవైపు.. విజయవాడలో బుడమేరు వరద ప్రభావానికి గురై నీటమునిగిన 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించి.. వరద నీటిలో చిక్కుకున్న వారికి ఆహారం అందిస్తున్నారు.
పొంచి ఉన్న ముప్పు
గత నాలుగురోజులుగా బుడమేరు పొంగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం.. ఈ వరద ప్రభావం తగ్గింది. అయితే.. ఎగువన కురుస్తున్న వర్షాలతో బుడమేరు తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నా రు. సుమారు 10 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రస్తుతం బుడమేరుకు వస్తున్నట్టు అంచనా వేశారు. మరోవైపు కొండపల్లిలో చెరువు కట్ట తెగడంతో అక్కడి ప్రజలు కూడా ముంపులో చిక్కుకున్నారు. మొత్తంగా ఏపీలో మరో నాలుగు రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.