Begin typing your search above and press return to search.

వారసుడు పుట్టిన వేళ !

లోకేష్ మాతామహుడు అయిన ఎన్టీఅర్ 1983 జనవరి 9న మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఏపీలో ప్రమాణం చేశారు.

By:  Tupaki Desk   |   23 Jan 2025 10:51 AM GMT
వారసుడు పుట్టిన వేళ !
X

తెలుగుదేశం పార్టీ వారసుడు పుట్టిన రోజు జనవరి 23 1983న పుట్టారు. అంటే అప్పటికే టీడీపీ పుట్టి తొమ్మిది నెలలలో అధికారం అందుకుంది. లోకేష్ మాతామహుడు అయిన ఎన్టీఅర్ 1983 జనవరి 9న మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఏపీలో ప్రమాణం చేశారు. ఇక 1983 జనవరి 5న బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఆ వెంటనే ప్రకటించారు. అయితే అవి రావడానికి రోజు మొత్తం పట్టింది.

ఫలితాలు వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 9వ తేదీని మంచి రోజుగా చూసుకుని అన్న గారు బాధ్యతలు చేపట్టారు ఎన్టీఆర్ సీఎం అయిన 14 రోజులకు లోకేష్ పుట్టారు. లోకేష్ పుట్టిన సమయానికి తండ్రి చంద్రబాబు కాంగ్రెస్ నుంచి మంత్రి హోదాలో చంద్రగిరి అసెంబ్లీ స్థానానికి రెండోమారు పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

అలా చూస్తే కనుక లోకేష్ తాత ముఖ్యమంత్రిగా తండ్రి మాజీ మంత్రిగా ఉన్న వేళ జన్మించారు అన్న మాట. అయితేనేమి లోకేష్ జాతకం దివ్యంగా ఉందని చెప్పాలి. ఆయన 2009 నుంచి టీడీపీలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ విజయానికి ఆయన తన వంతు బాధ్యత తీసుకున్నారు.

ఇక 2017లో ఆయన ఎమ్మెల్సీగా చేరి మంత్రిగా బాధ్యతలు కీలక శాఖలకు చేపట్టారు. లోకేష్ మంత్రి అయ్యేనాటికి ఆయన వయసు అక్షరాలా 34 ఏళ్ళు. ఇక 2024లో ఆయన మరింత కీలకం అయ్యారు. పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. ప్రభుత్వంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన మంత్రిత్వ శాఖలను చూస్తున్నారు.

ఇటీవలనే ఆయన ఉప ముఖ్యమంత్రి కావాలని తమ్ముళ్ళు డిమాండ్ చేసారు. ఇక భవిష్యత్తు ముఖ్యమంత్రిగా లోకేష్ ని మంత్రి టీజీ భరత్ కొనియాడారు. ఇలా లోకేష్ కి రాజకీయంగా అన్నీ మంచి శకునములే అన్నట్లుగా పరిస్థితులు ఉన్న వేళ ఆయన 43వ బర్త్ డే వేడుకలు చేసుకుంటున్నారు. లోకేష్ టీడీపీ కంటే తొమ్మిది నెలలు చిన్నవారు. తొలిసారి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కంటే పద్నాలుగు రోజులు చిన్న వారు.

కానీ ఆయనే ఈ రోజున పార్టీకి ప్రభుత్వానికి అచ్చమైన వారసుడిగా ఎదిగారు. ఇది తండ్రి చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహం శిక్షణతో పాటు లోకేష్ కి ఉన్న అభిరుచికి కూడా తార్కాణంగా చెప్పుకోవాలి. లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా తన వారసత్వాన్ని నాయకత్వాన్ని గట్టిగా రుజువు చేసుకున్నారు. అయిదేళ్ళ వైసీపీ పాలనలో విపక్షంలోకి టీడీపీ రావడం ఒక విధంగా లోకేష్ కి ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పాలి.

ఇక లోకేష్ తన భాష బాడీ లాంగ్వేజ్ ని కూడా బాగా మార్చుకున్నారు. పెద్దలంటే వినయంగా ఉంటారు. విషయాన్ని సూటిగా స్పష్టంగా చెబుతారు. పార్టీకి సంబంధించి ఆయన తెర వెనక సలహాలు సూచనలు కూడా ఎలాంటి మొహమాటం లేకుండా ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతాయి. చంద్రబాబుకు మొహమాటం ఎక్కువ. లోకేష్ మాత్రం భిన్నంగా కనిపిస్తారు. ఆయన ఎవరు పొగిడినా పొంగిపోరని చెబుతారు.

ఆయన తన లక్ష్యాలను బాగానే నిర్ధారించుకున్నారు. దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. టీడీపీకి కొత్త కళను తెస్తున్నారు. యువతరానికి పెద్ద పీట వేస్తున్నారు. మరో నలభయ్యేళ్ళ పాటు టీడీపీ మనుగడ కొనసాగించేలా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్రశంసనీయంగా ఉన్నాయి అని అంటున్నారు.

లోకేష్ టీడీపీకి ఈ రోజు ఆశాకిరణంగా మారారు. చంద్రబాబుకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. నిజంగా చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఆయన చాణక్యం ఎవరికీ అంతగా అలవాటు పడవు. కానీ లోకేష్ తన స్థాయిలో మాత్రం టీడీపీకి బలమైన వారసుడిగా మారుతున్నారు.

ఆయన మాతామహుడి పార్టీకి తండ్రి తరఫున వారసుడిగా నెగ్గుకుని రావడంలోనే ఘన విజయం సాధించారు. ఇక ముందు ముందు ఆయనకు అయితే టీడీపీలో పోటీ అయితే లేదు అన్నది నిర్వివాదాంశం. మంత్రిగా పార్టీ నాయకుడిగా తన సత్తాను ఎప్పటికప్పుడు చాటుకుంటూ ఇదే తీరున ఆయన ముందుకు సాగితే చాలు రేపటి భవిష్యత్తు కచ్చితంగా లోకేష్ ది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.