లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ వెనక స్టోరీ ఏంటి...!
మొత్తంగా ప్రభుత్వం ఏర్పడిన 7 మాసాల్లోనే నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ వినిపించడం గమనార్హం.
By: Tupaki Desk | 20 Jan 2025 10:45 AM GMTటీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలంటూ.. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసరెడ్డి.. ఎలాంటి తర్జన భర్జనలు లేకుండానే ఆయన సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వద్దే ప్రస్తావించారు.ఈ సందర్భంగా ఆయన నారా లోకేష్ చేసిన త్యాగాలను, పెట్టించుకున్న కేసులను కూడా వివరించారు. మొత్తంగా ప్రభుత్వం ఏర్పడిన 7 మాసాల్లోనే నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ వినిపించడం గమనార్హం.
అయితే.. ఇదేమీ రాత్రికి రాత్రికి వచ్చిన చర్చ అయితే కాదు. సహజంగానే నారా లోకేష్ గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర, వైసీపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడిన తీరు.. పార్టీ పరంగా నెంబర్ 2 నాయకుడు ఆయనే కావడం వంటి కారణాలతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నారా లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలన్న డిమాండ్లు తెరమీదికి వచ్చాయి. అయితే.. కూటమిలో జనసేనకు ఉన్న ప్రాధాన్యం రీత్యా... చంద్రబాబు ఒకే ఒక్కరికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు.
ఇదే సమయంలో పార్టీకి సేవ చేసిన నారా లోకేష్‌కు కీలకమైన ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను అందించారు. దీంతో అప్పటి వరకు తమ నాయకుడికి కీలకమైన పోస్టు కోరుకున్న పార్టీ నేతలకు ఊరట లభించింది. దీంతో వారు తమ డిమాండ్‌ను తగ్గించారు. ఇంతలో గత వారం రోజులుగా ఏపీలో చంద్రబాబు తర్వాత ఎవరు? అనే చర్చ వచ్చింది. రాజకీయంగా కూడా నారా లోకేష్ వారసుడు అయినప్పటికీ.. అది కేవలం పార్టీ పరంగానే ఉండకూడదన్నది మెజారిటీ నేతల అభిప్రాయం.
అంటే.. అటు పార్టీని, ఇటు సర్కారును కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఇస్తే. చంద్రబాబు తర్వాత.. చంద్రబాబు తరహాలోనే ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఈ క్రమంలోనే ఆర్. శ్రీనివాసరెడ్డి తన నోటి నుంచి ఈ డిమండ్‌ను పలికించారు.
ఇప్పటికిప్పుడు.. ఈ డిమాండ్‌పై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టకపోయినా.. 2014-19 మధ్య రెండేళ్లపాటు ఆగి.. ఎలా అయితే లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చారో.. ఇప్పుడు కూడా అదే జరిగినా జరగొచ్చని అంటున్నారు. సో.. ఏడాదికో.. రెండేళ్లకో అయినా.. నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.