ఏపీ ఉప ముఖ్యమంత్రిగా...లోకేష్ చెప్పిందేంటి ?
ఒక పార్టీ అధినేత సీఎంగా ఉంటే రెండో పార్టీ అధినేత జనాకర్షణ కలిగిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
By: Tupaki Desk | 8 March 2025 6:49 PM ISTఉప ముఖ్యమంత్రి ఇపుడు టీడీపీ కూటమిలో ఒక హాట్ టాపిక్ గా ఉంది. నిజానికి ఉప ముఖ్యమంత్రులు ఏపీలోనూ ఉమ్మడి ఏపీలోనూ కొత్త అయితే కాదు. ఎంతో మంది చేశారు. కానీ ఇపుడు కధ వేరు. ఒక పార్టీ అధినేత సీఎంగా ఉంటే రెండో పార్టీ అధినేత జనాకర్షణ కలిగిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో ఆయన పొలిటికల్ ఇమేజ్ వేరే లెవెల్ లో ఉంది.
దాంతో బాబు పవన్ అన్ని చోట్లా కనిపిస్తున్నారు. ఆ విధంగా చూస్తే బాబు తరువాత లోకేష్ అన్నది కాకుండా పవన్ అన్నది బాగా ప్రొజెక్ట్ అవుతోంది. దీంతో లోకేష్ అభిమానులు కానీ టీడీపీలో ఒక వర్గం వారు కానీ లోకేష్ కి ఆ పోస్టు ఇవ్వాలని ఇటీవల కాలంలో డిమాండ్ చేస్తూ వచ్చారు. చివరికి అది ఎక్కడో ఒక చోట ఆగింది. కానీ నివురుగప్పిన నిప్పులా అలాగే ఉంది.
అదే సమయంలో ఇది జాతీయ స్థాయిలో కూడా రాజకీయంగా నలుగుతున్న వార్తగానే ఉంది. అందుకే జాతీయ స్థాయిలో ఇండియా టుడే మీడియా ఇంటర్వ్యూ లో ఇదే ప్రశ్న మంత్రి నారా లోకేష్ కి ఎదురైంది. అది ఎలా అంటే వచ్చేసారి ఇండియా టుడే కాంక్లేవ్ కి నారా లోకేష్ వచ్చేటపుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తారని ఆశించవచ్చా అని యాంకర్ ప్రశ్నించారు.
నిజంగా యాంకర్ తెలివిగా వేసిన ప్రశ్న. లోకేష్ కి కాస్తా ఇబ్బంది పెట్టే ప్రశ్న. ఆయన జవాబు నుంచి సంచలనం కోరుకుని అడిగిన ప్రశ్న. కానీ నారా లోకేష్ అయితే బాగా పరిణతి సాధించారనే చెప్పాలి. అందుకే ఆయన కూల్ గానే జవాబు చెప్పారు.
తాను ఉప ముఖ్యమంత్రి కావాలా లేక ఏమి కావాలి అన్నది టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు చేతులలో లేదని అన్నారు. అదే సమయంలో ఏపీ ప్రజలను ఎవరు పాలించాలన్నది ఎవరు లీడ్ చేయాలన్నది వారే నిర్ణయించాలి తప్ప చంద్రబాబు చేతులలో ఏమీ లేదని కాస్తా డిప్లమాటిక్ గానే ఆన్సర్ ఇచ్చారు.
నిజానికి యాంకర్ అడిగింది ఉప ముఖ్యమంత్రి పదవి గురించి. ఈ పదవి ఇవ్వాలీ అంటే చంద్రబాబు చేతిలో పనే. కానీ లోకేష్ జవాబు చెప్పింది కాస్తా విస్తృఅంతంగా వచ్చే అర్ధంతోనే అని అంటున్నారు. ఏపీ ప్రజలను ఎవరు లీడ్ చేయాలన్నది ప్రజల చేతులలో ఉందని అన్నారు. లీడ్ చేయడం అంటే సీఎం పదవి అని అర్ధం వచ్చేలా లోకేష్ చెప్పారా అన్నది కూడా కొత్త చర్చకు తెర లేపుతోంది.
మరో వైపు చూస్తే తాను ఉప ముఖ్యమంత్రి మెటీరియల్ కాదని సీమె మెటీరియల్ అని లోకేష్ చెప్పకనే చెప్పారా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఉప ముఖ్యమంత్రి విషయం అయితే బాబు ద్వారానే జరుగుతుంది. కానీ సీఎం అంటే జనాల యాక్సెప్టెన్స్ ఉండాలి అన్న అర్ధంలో లోకేష్ వ్యాఖ్యానించారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ప్రజలు డిసైడ్ చేయాలి అని లోకేష్ అన్నారు అంటే ఆయన తాను కోరుకున్న పదవి కోసం మరో నాలుగేళ్ళ పాటు ఆగుతారు అని కూడా ఇందులో అర్ధం ఉందని అంటున్నారు. ప్రజలు ఎపుడు డిసైడ్ చేస్తారు అంటే ఎన్నికలు వచ్చినపుడే. సో 2029 నాటి మాటగా లోకేష్ అలా చెప్పారా అన్నది చర్చగా ఉంది. ఏది ఏమైనా ఇండియా టుడే అడిగిన ప్రశ్నకు రాజకీయ మసాలా ఎవరికి వారు దట్టించుకునేలాగానే లోకేష్ జవాబు ఉందని అంటున్నారు.