Begin typing your search above and press return to search.

లోకేశ్ ను మింగేసిన చంద్రబాబు!

బాబు రాజకీయ వారసుడైన నారా లోకేశ్ ను ఎలివేట్ చేసేందుకు ఇంతకు మించిన సమయం మరొకటి రాదు.

By:  Tupaki Desk   |   4 Sep 2024 7:30 AM GMT
లోకేశ్ ను మింగేసిన చంద్రబాబు!
X

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనలు కొన్ని సందర్భాల్లో ఏ మాత్రంఅర్థం కానట్లుగా ఉంటాయి. ఆయన ఎత్తులు.. వ్యూహాలు ఒక పట్టాన కొరుకుడు పడవు. పైకి చూసేందుకు సింఫుల్ గా అనిపిస్తున్నప్పటికి.. దిగితే కాన లోతులు తెలీవన్నట్లుగా ఉండే పరిస్థితి. ఒక విషయాన్ని ఇట్టే అన్నట్లుగా తేల్చేసే టైపు కాదు చంద్రబాబు. తాజాగా విజయవాడను ముంచెత్తిన వరదల వేళ.. చంద్రబాబు తీరును చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. బాబు రాజకీయ వారసుడైన నారా లోకేశ్ ను ఎలివేట్ చేసేందుకు ఇంతకు మించిన సమయం మరొకటి రాదు. అందరిలా వ్యవహరిస్తే ఆయన చంద్రబాబు ఎందుకు అవుతారు?

విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన నారా లోకేశ్.. వరదతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రాంతాల్లో పర్యటించటం.. సహాయ కార్యక్రమాల్ని అందించే మిషన్ లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ ఆయన ఇమేజ్ పెద్దగా పెరగలేదు. ఆ మాటకు వస్తే.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఎక్కడా హైలెట్ కాలేదు. ఎందుకిలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా లాంటి వాళ్లకైతే నారా లోకేశ్ విజయవాడలోనే లేరని.. హైదరాబాద్ లో ఎంజాయ్ చేసేస్తున్నట్లుగా కనిపించిన వైనం.

ఎందుుకిలా? పని చేసి కూడా పని చేయనట్లుగా? పెద్దగా ఫోకస్ కాకుండా ఉండటం ఏమిటి? చంద్రబాబుకు అసలుసిసలు రాజకీయ వారసుడిగా అందరూ భావించే నారా లోకేశ్ ను విజయవాడ వరదల వేళ.. ఘనంగా చూపించొచ్చు కదా? అతడ్ని రాజకీయంగా మరింత పాతుకుపోయేలా చేయొచ్చు కదా? లాంటి ప్రశ్నలు మదిలో మెదులుతాయి. కానీ.. అలా చేస్తే.. మైలేజీ కంటే డ్యామేజీనే ఎక్కువ. దీనికి కారణం.. ఏ మాత్రం హైలెట్ అయినా.. చంద్రబాబు కొడుకు కావటంతోనే హైలెట్ అయ్యారన్న వాదన వ్యక్తమవుతుంది. అందులోకి ఏపీలో నడుస్తున్నది కూటమి సర్కారు.

ఈ తరహా ప్రభుత్వంలో హైలెట్ అయితే గియితే చంద్రబాబు తర్వాత పవన్ కల్యాణ్ కావాలే కానీ.. నారా లోకేశ్ అయితే లెక్కలు తేడా వచ్చే వీలుంది. దీనికితోడు.. ఇప్పటికే తనకు ప్రచార కండూతి లేదని.. తన పరిధికి మించి వ్యవహరించనన్నట్లుగా పవన్ వ్యవహరిస్తున్న తీరును చూసిన తర్వాత.. దాన్ని ఫాలో కాకుంటే చంద్రబాబుకే నష్టం. అందుకే.. నారా లోకేశ్ హైలెట్ అయ్యే కన్నా.. లోప్రొఫైల్ మొయింటైన్ చేస్తున్న పరిస్థితి. కొందరైతే వరద సహాయక చర్యలు మొత్తం చంద్రబాబు పేరు మీదే జరుగుతున్నాయి. అస్సలు మైలేజీ రావట్లేదని అనుకుంటున్న పరిస్థితి. యువ నేత లోకేశ్ ను చంద్రబాబు తన ఇమేజ్ తో మింగేశాడని.. హైలెట్ కాలేదన్న భావన వ్యక్తమవుతోంది. ఇదంతా విన్న వారిలో కొందరి నోటి నుంచి వస్తున్న మాట.. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్న సామెతను ప్రస్తావిస్తున్నారు. నిజమే కదా?