Begin typing your search above and press return to search.

పదిహేను రోజులలో అమిత్ షా తో రెండు భేటీలు...మ్యాటరేంటి ?

కేంద్ర మంత్రిగా అమిత్ షా వ్యూహరచనా చతురుడు అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   22 Oct 2024 4:30 PM GMT
పదిహేను రోజులలో అమిత్ షా తో రెండు భేటీలు...మ్యాటరేంటి ?
X

బీజేపీలో కేంద్రంలో అత్యంత బలమైన శక్తివంతమైన నాయకుడు ఎవరు అంటే ఠక్కున చెప్పే పేరు అమిత్ షా. ఆయన కేంద్ర హోంమంత్రి. మోడీ అమిత్ షా ఒక సక్సెస్ ఫుల్ జోడీ. కేంద్ర మంత్రిగా అమిత్ షా వ్యూహరచనా చతురుడు అని చెప్పాలి. ఆయన బీజేపీ మిత్రులతో సాన్నిహిత్యాన్ని కొనసాగించడమే కాకుండా వారి విషయంలో ఎప్పటికప్పుడు భేటీలు అవుతూ బంధాలను బలోపేతం చేసుకుంటూంటారు.

ఇక తెలుగుదేశం విషయానికి వస్తే 2014 నుంచి 2018 దాకా కొనసాగిన బంధం అప్పట్లో తెగిపోయింది. ఆ మధ్యలోకి జగన్ వచ్చి చేరారు. ఫలితంగా 2019లో ఘోర పరాజయం కూడా టీడీపీని పలకరించింది. 2024 ఎన్నికల్లో మాత్రం ఆ తప్పు చేయకుండా టీడీపీ ముందే జాగ్రత్త పడింది. బీజేపీతో పొత్తుని కొనసాగించడం వల్ల కలిగిన గరిష్ట లాభం ఏమిటో కూడా తెలుసుకుంది.

ఇక జమిలి ఎన్నికలు వచ్చినా లేదా షెడ్యూల్ ప్రకారమే 2029లో ఎన్నికలు వచ్చినా కూడా బీజేపీతో కలసే ఎన్నికలకు వెళ్లాలన్నది తెలుగుదేశం విధానంగా మారింది. ఇవన్నీ పక్కన పెడితే ఈ నెల మొదటి వారం అంటే 7న ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు రెండు రోజుల పాటు అక్కడ బిజీగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన అమిత్ షాతో సుదీర్ఘ భేటీ వేశారు.

ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద చర్చతో పాటు రాజకీయాల గురించి కూడా చర్చలు జరిగే ఉంటాయని అంటున్నారు. పైగా టీడీపీ ఎన్డీయే కూటమిలో అతి ముఖ్య భాగస్వామి కావడంతో బీజేపీ కూడా టీడీపీ చెప్పేది వింటుంది అని అంటున్నారు.

చంద్రబాబు ఏపీలో కూటమి మరింత బలంగా నిలిచేందుకు అవసరమైన సలహా సూచనలు చెబుతూనే విపక్ష వైసీపీ విషయంలోనూ అమిత్ షాతో చర్చించి ఉంటారని అంటున్నారు. జగన్ టార్గెట్ గా ఏపీలో పాలిటిక్స్ చేస్తున్న టీడీపీకి కేంద్రం అండ కావాలని అంటున్నారు. ఆ మేరకే చర్చించి ఉంటారని కూడా చెబుతున్నారు.

ఇక సీన్ కట్ చేస్తే మంత్రి నారా లోకేష్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఆయన కూడా పలువురు కేంద్ర మంత్రులను కలిసారు. వీటన్నిటికంటే విశేషం ఏంటి అంటే కేంద్ర మంత్రి అమిత్ షాని కలవడం. ఆయనతో లోకేష్ గంటన్నర పాటు సమావేశం జరపడం. గతంలో లోకేష్ అమిత్ షాను కలిశారు కానీ మంత్రిగా కాదు. చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉన్నపుడు ఆయన కేంద్ర మంత్రిని కలిసారు.

ఈసారి అలా కాదు కూటమిలో ముఖ్య మిత్రపక్షం అయిన టీడీపీ భావి నేతగా. ఏపీలో పవర్ ఫుల్ లీడర్ వారసుడిగా రైజింగ్ పొలిటీషియన్ గా ఉన్న నార లోకేష్ అమిత్ షాను కలవడం అంటే దానిని విశేషంగా చూస్తున్నారు. ఈ సందర్భంగా కూడా కచ్చితంగా రాజకీయ చర్చలు జరిగి ఉంటాయని అంటున్నారు. ఏపీలో గత అయిదేళ్ళ వైసీపీ హయాంలో వ్యవస్థలను ఎలా ఇబ్బంది పెట్టారో నాశనం చేశారో లోకేష్ వివరించారని ప్రచారం సాగింది.

ఇక బీజేపీ టీడీపీల ఉమ్మడి శత్రువుగా జగన్ ని చేసినట్లు అయితేనే ఏపీలో వైసీపీని పూర్తి స్థాయిలో అడ్డుకోవడం జరుగుతుందని అంటున్నారు. బీజేపీ అయితే ఈ రోజుకీ టీడీపీ జనసేనలనే పూర్తిగా నమ్ముకుంది. కానీ రాజకీయాలు ఎపుడూ ఒకేలా ఉండవు. రేపటి రోజు పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఎవరూ ఊహించలేరు.

దాంతో పాటు వైసీపీ బీజేపీ గతంలో పరోక్ష చెలిమిని నడిపారు. బీజేపీ తన పొలిటికల్ స్ట్రాటజీ కే టాప్ ప్రయారిటీ ఇస్తుంది. దాంతో టీడీపీ బీజేపీకి ఉమ్మడి శత్రువుగా జగన్ ని ఎంతవరకూ ఉంచగలిగారు అన్న దానిని అంచనా వేయాలీ అంటే రాబోయే రోజులలో చోటు చేసుకోబోయే పరిణామాలే దానిని చెబుతాయని అంటున్నారు. జగన్ ఇండియా కూటమి వైపే అని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయగలిగితే బీజేపీ నుంచి గట్టి ముప్పే వైసీపీకి ఉంటునని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.