టీడీపీలో సీనియర్లు తప్పుకోవాల్సిందే ?
అందుకే రాజకీయ పార్టీలు కొత్తదనం నింపేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
By: Tupaki Desk | 31 March 2025 10:30 PMపాత నీరు వెళ్ళడం కొత్త నీరు రావడం సర్వ సహజం. ఇది ప్రకృతి నియమం కూడా. పాత వారు ఉంటే పనితీరు రొటీన్ గా ఉంటుంది. జనాలకు బోర్ కొడుతుంది. అదే కొత్త ముఖాలు ఉంటే ఉత్సాహం వస్తుంది. అదే సమయంలో కొత్త వింతగా మోజుగా ఉంటుంది. అందుకే రాజకీయ పార్టీలు కొత్తదనం నింపేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
తెలుగుదేశం పార్టీ వరకూ చూస్తే ఆ పార్టీ పుట్టి 42 ఏళ్ళు అయింది. పార్టీలో తొలిలో చేరిన వారిదే ఈ రోజుకీ పెత్తనం. వారు అప్పట్లో పాతికేళ్ళ వారు అయితే ఇపుడు డెబ్బైకి చేరువలో ఉన్నారు. దాంతో నారా లోకేష్ జమానాలో కొత్త వారికి పెద్ద పీట వేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ల నుంచి మొదలుపెట్టి మంత్రుల దాకా కూడా కొత్త వారికే అధిక ప్రాముఖ్యత ఇవ్వడాన్ని కూడా అంతా గమనిస్తున్నారు.
ఇక పార్టీలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి రంగం సిద్ధం అవుతోంది అని అంటున్నారు. ఇటీవల నారా లోకేష్ కూడా పార్టీ సీనియర్లను గౌరవిస్తుంది అదే సమయంలో కొత్త వారికి అవకాశాలు ఇస్తుంది అని ప్రకటించారు అని గుర్తు చేస్తున్నారు.
అంటే టీడీపీకి గుండె కాయ లాంటి పొలిట్ బ్యూరో నుంచే ఈ ప్రక్షాళన మొదలవుతుంది అని అంటున్నారు. పొలిట్ బ్యూరోలో చూస్తే మొత్తం పెద్ద తలకాయలు ఉన్నారు. అంతా సీనియర్ మోస్ట్ లీడర్లు, చంద్రబాబు కాలం నాటి వారు ఇపుడు అక్కడ నుంచే అంతా మార్చుకుంటూ రావాలన్న ప్రయత్నం సాగుతోంది అని అంటున్నారు.
ఇక ఈ విషయం మీద సీనియర్ నేతలు ఎవరూ తమ అభిప్రాయం ఏమిటో బయటకు చెప్పలేదు కానీ పార్టీలో అయితే విస్తృతంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాజిటివ్ గా స్పందించారు.
పార్టీలో రెండు టెర్ములు ఒకే పదవిలో ఉన్న వారు పై స్థాయికి అయినా వెళ్ళాలి లేదా ఒక టెర్మ్ గ్యాప్ అయినా తీసుకోవాలన్న లోకేష్ ప్రతిపాదనకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. తాను లోకేష్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా చెప్పారు.
ఇక తాను 2012 నుంచి పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నాను అని తన పోస్టుని ఈసారి వేరే ఎవరికి అయినా ఇవ్వవచ్చు అని ఆయన ఓపెన్ గా చెప్పేశారు. లోకేష్ మార్క్ పార్టీ ప్రక్షాళనకు తాను సిద్ధమని సోమిరెడ్డి సంచలన నిర్ణయమే తీసుకున్నారు.
మరి ఇతర సీనియర్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది చూడాలని అంటున్నారు. ఎందుకంటే టీడీపీకి విధానపరమైన అత్యున్నత వేదిక పొలిట్ బ్యూరో. అక్కడ కనుక మెంబర్ గా ఉంటే కీలక నిర్ణయాలలో భాగస్వాములు కావచ్చు. అధినాయకత్వం తో నిరంతరం టచ్ లో ఉండొచ్చు. ఒక విధంగా పార్టీలో హవా చలాయించవచ్చు. సీనియర్లు చాలా మంది పొలిట్ బ్యూరో లో అనేక సార్లు నెగ్గుతూ వస్తున్నారు.
మరి వారి ప్లేస్ ని రీప్లేస్ చేస్తామని అంటే కనుక ఎంతమంది దీనికి అంగీకరిస్తారు అన్నది చర్చగా ఉంది. అయితే పార్టీ పాలసీగా ఉంటే కనుక అది కచ్చితంగా అమలు చేసి తీరుతారు అని అంటున్నారు అని అంటున్నారు. ఇక చూస్తే టీడీపీ మహానాడు మే నెలలో ఉంది. 27 నుంచి మూడు రోజుల పాటు ఘనంగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కీలక పదవులు అన్నీ సీనియర్ల నుంచి జూనియర్లకు వెళ్ళేలా ఒక పూర్తి స్థాయి కసరత్తు అయితే సాగుతోంది అని అంటున్నారు. సో టీడీపీ పుట్టాక ఇంతటి భారీ రాజకీయ పరిణామం అయితే చోటు చేసుకోలేదని అంటున్నారు. అది ఎలా సాగుతుంది అన్నది చూడాలని అంటున్నారు.