నారా లోకేష్ స్పూర్తితో... బీఆర్ఎస్ అదే సెంటిమెంట్ తో !
దాంతో వాటిని ఎంతో కొంత నిరోధించడానికైనా మేము అధికారంలోకి వస్తే అందరి లెక్కలూ తేలుస్తామని చెప్పాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 14 Feb 2025 1:30 AM GMTరాజకీయ పార్టీలు ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానాలు చేస్తూంటాయి. వాటిని అమలు చేయడానికి కృషి చేస్తూంటాయి. అయితే ఒకప్పటిలా ఈనాడు రాజకీయం లేదు. అందుకే క్యాడర్ కి ధైర్యం ఇవ్వాలి. నాయకులకు కూడా భరోసా ఇవ్వాలి. ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీని కాపాడుకోవాలి. అంతే కాదు నేరుగా అధినేతలూ అధినాయకత్వం మీద కూడా పాలక పక్షాలు దాడులు చేస్తున్న నేపథ్యం ఉంది. దాంతో వాటిని ఎంతో కొంత నిరోధించడానికైనా మేము అధికారంలోకి వస్తే అందరి లెక్కలూ తేలుస్తామని చెప్పాల్సి ఉంటుంది.
దానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆయన యువగళం సభలలో మాట్లాడుతూ రెడ్ బుక్ అన్న దానిని పరిచయం చేశారు. నాటి వైసీపీ ప్రభుత్వం చేసే అక్రమాలు క్యాడర్ విషయంలో పెడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా గమనించి జాగ్రత్తగా రెడ్ బుక్ లో రాస్తున్నామని చెప్పారు. మేము అధికారంలోకి వస్తే రెడ్ బుక్ ప్రకారం అందరి లెక్కలు తేలుస్తామని స్పష్టంగా వెల్లడించారు.
దానికి జనామోదం లభించింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక ఏపీలో చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోంది అని విపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. అయినా సరే రెడ్ బుక్ అనేది ఇపుడు ఏపీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గట్టిగానే వినిపిస్తోంది. ఇక విపక్ష వైసీపీ అయితే తాము కూడా ఒక బుక్ ని రాస్తామని ఆ మధ్యన చెప్పింది. ఇపుడు 2.0 అని కొత్త స్లోగన్ ఆ పార్టీ అందుకుంది.
సరే ఏపీ రాజకీయం ఇలా ఉంటే తెలంగాణాకు కూడా ఈ రెడ్ బుక్ ప్రభావం బాగానే పాకింది అని చెప్పాలి. బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కవిత అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పభుత్వం బీఆర్ఎస్ నేతలతో పాటు తమను కూడా టార్గెట్ చేస్తోంది అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది అని ఫైర్ అయ్యారు.
సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినా కూడా పోలీసులు తమ క్యాడర్ ని వేధిస్తున్నారని ఇక నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. అందరి లెక్కలు తేలుస్తారమని దాని కోసం పింక్ బుక్ ని ఓపెన్ చేస్తామని చెప్పడం విశేషం. అందులో అక్రమార్కుల లెక్కలు రాస్తామని ఎవరి లెక్కలు ఎలా రాయాలో తమకు బాగా తెలుసు అని ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు.
ఈ పింక్ బుక్ ప్రకటనను విన్న వారు ఇదంతా నారా లోకేష్ స్పూర్తితోనేనా అని చర్చిస్తున్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ తో ఫ్యామస్ అయ్యారని ఆ విధంగానే ఆ పార్టీ గెలిచిందని మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా గులాబీ పార్టీ కూడా ఫాలో ఫాలో అంటోందా అన్నది కూడా చర్చిస్తున్నారు. ఏది ఏమైనా రెడ్ బుక్ అని లోకేష్ అంటే అది అతి పెద్ద సంచలనం అయింది. మరి కవిత పింక్ బుక్ అంటున్నారు ఇది ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.