'సింగిల్ నంబర్ తో 200 సేవలు.. ప్రపంచంలోనే ఏపీలో ఇదో సంచలనం : నారా లోకేష్
శనివారం ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.
By: Tupaki Desk | 8 March 2025 8:49 PM ISTమనమిత్ర పథకం ద్వారా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ కొత్త సదుపాయంతో కుల ధ్రువపత్రాలు, హాల్ టికెట్లు, ఇతర పత్రాలు, ల్యాండ్ రికార్డులను సులభంగా వాట్సాప్ ద్వారా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో టెక్నాలజీ వినియోగం పెరుగుతుందని తెలిపారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా డేటా భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ దేశ ప్రగతికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
-ఏఐ హబ్ గా ఆంధ్రప్రదేశ్
మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏఐ హబ్ గా ఏపీని మార్చబోతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనకరమైన ఒప్పందాలను కుదురుస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా టాటా పవర్‌తో 7 గిగా వాట్స్ ఒప్పందం జరిగినట్లు వెల్లడించారు. అదేవిధంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో అభివృద్ధి కోసం అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మనమిత్ర పథకం ద్వారా ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని, ప్రజలకు వీలైనంత త్వరగా అవసరమైన పత్రాలను అందించగలమని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ వృద్ధికి తోడ్పడుతూ, డిజిటల్ మార్గంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.హైదరాబాద్ కు ఐటీ ఎలాగైతే టీడీపీ తీసుకొచ్చిందే ఇప్పుడు అమరావతికి, వైజాగ్ కు ఏఐని తీసుకొస్తామని.. ఏపీని ఈ కొత్త టెక్నాలజీలో నంబర్ 1గా నిలబెడుతామని నారా లోకేష్ స్పష్టం చేశారు.