'వైసీపీ మంత్రిని టీడీపీ ఎమ్మెల్సీలు తన్నారు'.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో గతంలో వైసీపీ మంత్రిని టీడీపీ ఎమ్మెల్సీలు తన్నారంటూ షాకింగ్ విషయం చెప్పారు.
By: Tupaki Desk | 31 March 2025 7:35 PMఅనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యలమంచిలి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా... కార్యకర్తలకు భరోసా కాదు.. సమస్యలు పరిష్కరించేందుకు వచ్చానని చెప్పాను. ఈ నేపథ్యంలో గతంలో వైసీపీ మంత్రిని టీడీపీ ఎమ్మెల్సీలు తన్నారంటూ షాకింగ్ విషయం చెప్పారు.
అవును... వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ మంత్రిని మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు బీటెక్ రవి, బీద రవి గట్టిగా తన్నారని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే... ఈ ఘటన నాడు బయటకు రాలేదని.. పరువు పోతుందనే కారణంతోనే వాళ్లూ ఈ విషయాన్ని బయట చెప్పుకోలేదని మంత్రి పేర్కొన్నారు. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.
ఇదే సమయంలో... నాడు చంద్రబాబు ఒక్క మాట చెబితే అందరం అదే మాట మీద నిలబడ్డామని.. మండలిలో ఓసారి వైసీపీ నేతలు తనపై దాడికి ప్రయత్నిస్తే నాగ జగదీశ్ అడ్డుకున్నారని.. చలపతిరావు, ఫరూఖ్ గట్టిగా పోరాడారని తెలిపారు. దీంతో... ఏపీ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
టీడీపీ ఎమ్మెల్సీలు బీటెక్ రవి, బీద రవితో తన్నులు తిన్న ఆ వైసీపీ మంత్రి ఎవరు అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మరి.. ఆ మంత్రి పేరు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా.. లేదా అనేది వేచి చూడాలి.
మరోపక్క కార్యకర్తలతో నారా లోకేష్ కీలక విషయాలు వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా సమస్యలు ఏమైనా ఉంటే కలిసికట్టుగా చర్చించుకుని పరిష్కరించుకుందామని.. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ అధినేతలు అనే మాటను శిరసావహిస్తూ.. నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరుగుతోందని అన్నారు.
ఇదే సమయంలో... కార్యకర్తలకు నాయకులు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. అదేవిధంగా... మిత్రధర్మం పాటించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసిన ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇస్తూ.. అలకలు మాని పార్టీ కోసం పనిచేయాలని కోరారు.
ఈ సందర్భంగా... అనకాపల్లి - అచ్యుతాపురం మధ్య నాలుగు వరుసల రహదారికి, అచ్యుతాపురం కూడలిలో ఫ్లైఓవర్ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. వీటితో పాటు రూ.243 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు.