ఎవరు చెప్పారు అమ్మా.. ఎవరు చెప్పారు తల్లీ.. : మండలిలో లోకేశ్ ఉగ్రరూపం
టీడీపీ యువనేత, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉగ్రరూపం చూపించారు. మండలి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న ఆయన వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపణలు ఓ రేంజ్ కౌంటర్ ఇచ్చిపడేశారు.
By: Tupaki Desk | 25 Feb 2025 10:14 AM GMTటీడీపీ యువనేత, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉగ్రరూపం చూపించారు. మండలి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న ఆయన వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపణలు ఓ రేంజ్ కౌంటర్ ఇచ్చిపడేశారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుపై వైసీపీ ఎమ్మెల్సీ చేసిన కామెంట్స్ ను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రానికి అన్ కండీషనల్ గా తాము మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేకపోతే కేంద్రంలో మోదీ ప్రభుత్వమే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారన్న వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరు చెప్పారు అధ్యక్షా.. ఎవరు చెప్పారు తల్లి.. ఎవరు చెప్పారు అమ్మా అంటూ ఎమ్మెల్సీని లోకేశ్ నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ కండీషనల్ గా ఎన్డీఏకి మద్దతు ప్రకటించామని, ఎన్నికలకు ముందే తమ కూటమి ఏర్పడిందని చెప్పారు. తాము పదవులు అడగలేదని, రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతున్నామని వివరించారు. గత ప్రభుత్వం చేతకానితనం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని కేంద్రానికి నివేదించి పోలవరం, అమరావతికి నిధులు తెచ్చామని, విశాఖ రైల్వే జోన్ సాధించామని తెలిపారు. మేము ఎక్కడా అనని మాటలను వైసీపీ ఎమ్మెల్సీ ఎలా అంటారని నిలదీశారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ సభ్యులు అనని మాటలను ఎమ్మెల్సీ వరుదు కల్యాణి చెప్పడం కరెక్టు కాదన్నారు. తాము అన్ కండీషనల్ గా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి సపోర్టు చేశామన్నారు. మీ నాయకుడు, పులివెందుల ఎమ్మెల్యే ఏమన్నారు.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారని, కానీ ఏమైందని ప్రశ్నించారు. ఐదేళ్లు అన్ని బిల్లులకు సపోర్టు చేశారని, ప్రత్యేక హోదా తేలేకపోయారని విమర్శించారు. టీడీపీ, జనసేన కలిపి ఎన్నికలకు ముందే బీజేపీకి మద్దతు ప్రకటించామని, డబుల్ ఇంజిన్ సర్కారు తెచ్చామన్నారు.
రైల్వే జోన్ ఎవరు కాపాడారు? విశాఖ ఉక్కుకు రూ.13 వేల కోట్లు తెచ్చాం.. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు గతంలో ఏం చేశారంటూ లోకేశ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రానికి మద్దతు చెబుతున్నామని మళ్లీ మళ్లీ పునరుద్ఘాటించారు. తమ మద్దతు లేకపోతే కేంద్రం లేదన్న మాటలను మేము ఎక్కడా అనలేదని, ఎమ్మెల్సీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేశ్ పట్టుబట్టడంతో వైసీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.