పవనన్నా అంటూ అల్లుకుపోతున్న లోకేష్!
లోకేష్ ఆ స్థాయిని అందుకోగలరా అన్న డౌట్లు అయితే అంతా వ్యక్తం చేసేవారు కానీ లోకేష్ బాగా రాటుతేలారు.
By: Tupaki Desk | 7 March 2025 9:55 PM ISTనారా లోకేష్. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు. తండ్రి బాబు వ్యూహాలు చాణక్యుడినే తలపిస్తాయి. లోకేష్ ఆ స్థాయిని అందుకోగలరా అన్న డౌట్లు అయితే అంతా వ్యక్తం చేసేవారు కానీ లోకేష్ బాగా రాటుతేలారు. విపక్షంలోకి టీడీపీ వచ్చాక లోకేష్ తన నాయకత్వానికి పదును పెట్టారు.
యువగళంతో ఆయన దూసుకునిపోయారు ఇపుడు టీడీపీలో మొత్తం వ్యవహారాలను చూస్తున్న లోకేష్ మిత్రపక్షం జనసేనతో బంధాన్ని పదింతలు చేసుకుంటూ అల్లుకుపోతున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా అసలు వదలడంలేదు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ పవన్ ని కార్పోరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని సెటైర్లు వేస్తే దాని మీద అందరి కంటే ముందుగా రియాక్టు అయింది లోకేష్.
పవన్ జోలికి వస్తే బాగోదు అని వైసీపీకి మాస్ వార్నింగ్ ఇచ్చింది కూడా ఆయనే. పవన్ సత్తా ఏమిటో ఆయన స్థాయి ఏమిటో లోకేష్ వివరించిన తీరు నిజంగా జనసైనికులకు ఎంతో ఆనందం కలిగించింది. ఇక ఇపుడు చూస్తే మరో అంశంలో లోకేష్ ముందుకు వచ్చి మనసారా జనసేనను అభినందించారు.
జనసేన తరఫున మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్ధిగా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి వచ్చినపుడు ఆయనకు మద్దతుగా వెంట వచ్చిన వారు నారా లోకేష్. ఆయన నాగబాబుతో కలిపి అడుగులు వేసారు. ఆయన నామినేషన్ దాఖలు చేస్తున్నపుడు ఆసాంతం వెంటే ఉన్నారు.
నాగబాబుతో కరచాలనం చేసి మరీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఇవన్నీ చూసినపుడు నారా లోకేష్ పవనన్నా అని వేదికల మీద పెదవుల నుంచి మాత్రమే పలకడం లేదని నిజంగా గుండె లోతుల్లలో నుంచే ఆయన అన్నయ్యా అని ఆప్యాయంగా పిలుస్తున్నారని అంతా అంటున్నారు. ఇక టీడీపీ కూటమి కట్టింది. మిత్రులు అయిన జనసేన బీజేపీలను బాగా చూసుకుంటూ సమాదరిస్తోంది.
చంద్రబాబు ఈ విషయంలో చాలా దూరదృష్టితోనే వ్యవహరిస్తారు. అయితే నారా లోకేష్ కూడా అచ్చం తండ్రి బాటలోనే అడుగులు వేస్తూ మిత్రుల మనసులను చూరగొంటున్నారు. నిజానికి ఏపీలో టీడీపీ పెద్ద పార్టీ. దాదాపుగా అర్ధ శతాబ్దం వయసు ఉన్న పార్టీ. బూత్ లెవెల్ నుంచి ఉన్న పార్టీ గ్రౌండ్ లెవెల్ లో కరడు కట్టిన లక్షలాది మంది క్యాడర్ ఉన్న పార్టీ.
ఇటీవలనే కోటి మందికి పైగా పార్టీ సభ్యత్వం తీసుకున్న పార్టీ. అయినా సరే టీడీపీ మిత్రులను వదులుకోవడానికి ఇష్టపడడంలేదు. 2019 ఎన్నికల్లో చేసిన తప్పులనూ పొరపాట్లను చేయకూడదనే అనుకుంటోంది. అదే సమయంలో మిత్రులు ఇబ్బంది పడకుండా తాను జాగ్రత్తలు అనేకం తీసుకుంటోంది.
మిత్రులకు కాలికి దెబ్బ తగిలితే తన కంట్లో తగిలినంతగా నారా లోకేష్ ఫీల్ అవుతున్నారు. ఆయన అందుకే జనసేనను ఎవరైనా విమర్శిస్తే అసలు ఊరుకోవడంలేదు. ఈ బంధం మరిన్ని ఎన్నికల పాటు కొనసాగాలని పవన్ కోరుకుంటూంటే దానిని తగినట్లుగానే టీడీపీ కూడా సిద్ధమంటోంది.
అలా పవన్ ని ఆయన వెనక ఉన్న లక్షలాది మంది అభిమానులను అలాగే బలమైన సామాజిక వర్గాన్ని టీడీపీ అధినాయకత్వం ఆకట్టుకుంటోంది. నిజానికి కూటములు కట్టిన పార్టీలలో అధికారం రావడంతోనే అసంతృప్తులు వస్తాయి. విభేదాలు పొడసూపుతాయి. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి అలా లేదు. దానికి కారణం చంద్రబాబు నారా లోకేష్.
అందుకే ఈ ఇద్దరి వ్యూహాలూ అదుర్స్ అంటున్నారు. జనసేన విషయంలో టీడీపీ ఇస్తున్న ప్రయారిటీ చూసిన వారు ఈ కూటమికి ఎన్నడూ బీటలు వారే పరిస్థితి అయితే అసలు కనిపించదనే అంటున్నారు. వాస్తవిక దృక్పధంతో అడుగులు వేస్తున్న తీరు మాత్రం ఆసక్తిని గొలుపుతోంది.