స్టాలిన్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన లోకేష్!
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ త్రిభాషా విధానంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
By: Tupaki Desk | 8 March 2025 8:25 PM ISTతమిళనాడు ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య త్రిభాషా సూత్రంపై వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వం ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నంగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ త్రిభాషా విధానంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
శనివారం ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న లోకేష్, త్రిభాషా విధానం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారత రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. త్రిభాషా విధానం ప్రాంతీయ భాషలకు ఎలాంటి హాని చేయదని, భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకే ఈ విధానం ఉద్దేశించిందని వివరించారు.
అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులకు జర్మన్, జపనీస్ వంటి భాషలను నేర్చుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్న ఆయన, బహుళ భాషా పరిజ్ఞానం ఆధునిక ప్రపంచంలో చాలా కీలకమని నొక్కిచెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాతృభాషలను బలోపేతం చేయడానికే కట్టుబడి ఉందని, స్థానిక భాషలకు ముప్పు కలిగించదని స్పష్టం చేశారు.
దక్షిణాది రాష్ట్రాల్లో త్రిభాషా విధానం , డీలిమిటేషన్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ విధానాన్ని సమర్థించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన త్రిభాషా విధానానికి లోకేష్ మద్దతుగా నిలవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇక, ఆయన వ్యాఖ్యలపై తమిళనాడు నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది.