బాబు బరువు తగ్గారంటున్న భువనేశ్వరి... లోకేష్ నోట స్టెరాయిడ్ల మాట!
ఇదే సమయంలో చంద్రబాబు బరువు తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు నారా భువనేశ్వరి. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు.
By: Tupaki Desk | 13 Oct 2023 7:32 AM GMTస్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు గత 33 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో గురువారం సాయంత్రం ఆయనకు స్వల్ప అస్వస్థత వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే రియాక్టైన జైలు అధికారులు.. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులను పిలిపించి చికిత్స అందించారు. అనంతరం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
గత కొన్ని రోజులుగా ఎండలు ఎక్కువగా ఉండటంతో, జైలు గదుల్లో వేడి పెరిగి బాబు డీహైడ్రేషన్ కు లోనవుతున్నారని అంటున్నారు. మరోపక్క చర్మ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో హార్ట్ బీట్, బీపీ అన్నీ నార్మల్ గానే ఉన్నాయని రాజమండ్రి జీజీహెచ్ వైద్యులు తెలిపారు! ఈ క్రమంలో టీడీపీ నేతలు బాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అవును... చంద్రబాబు జైలుకు వెళ్లినప్పటినుంచీ దోమలు కుడుతున్నాయని, డెంగ్యూ రప్పించి చంపాలని చూస్తున్నారని, స్నానానికి వేడి నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో జైల్లో ఏసీ లేదని బాబు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై వైసీపీ నేతలు చేసిన కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా డీహైడ్రేషన్ ఇష్యూపై తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో... చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ జైల్ భరో కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ నేతలు చెపట్టారు. రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు. ఆయనకు ఇప్పుడు అత్యవసర వైద్య సేవలు అవసరం అని ఆమె తెలిపారు. ఇదే సమయంలో లోకేష్ స్పందించారు.
ఇందులో భాగంగా... చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన అన్నారు. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని.. ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. జైల్లో దోమలు, కలుషిత నీటితో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అనంతరం... చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే జగన్ దే బాధ్యత అని లోకేష్ తెలిపారు.
ఇదే సమయంలో చంద్రబాబు బరువు తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు నారా భువనేశ్వరి. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు భువనేశ్వరి మరిన్ని విషయాలు వెల్లడిస్తూ ట్వీట్ చేశారు.
ఇందులో భాగంగా... "జైలులో నా భర్తకు సకాలంలో వైద్యం అందించట్లేదు. ఇప్పటికే ఆయన 5 కిలోల బరువు తగ్గారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. జైలులో ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయి. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. జైలులో పరిస్థితులు నా భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయి. చంద్రబాబుకు అత్యవసరం వైద్యం అవసరం" అని తెలిపారు.