లోకేష్ బిగ్ మిస్టేక్...బాబుకు నో ఓదార్పు...!
దాని నుంచి తేరుకుని పార్టీని ఉరుకులు పరుగులు పెట్టించాల్సిన నారా లోకేష్ ఢిల్లీ పోయి ఇరవై రోజులు అక్కడే గడిపేశారు.
By: Tupaki Desk | 6 Oct 2023 8:53 AM GMTబాబు లేని తెలుగుదేశం వ్యూహాలు లేక చతికిలపడుతోంది. చంద్రబాబు బయట ఉండే ఏదో విధంగా మ్యానేజ్ చేసి పార్టీ జనంలో ఉందనిపించేవారు. అయితే ఆయన పాతిక రోజులకు పైగా జైలులో ఉండడంతో మొత్తం టీడీపీ నిస్తేజం అయింది. ఇది నిజంగా పార్టీకి షాకింగ్ పరిణామం. దాని నుంచి తేరుకుని పార్టీని ఉరుకులు పరుగులు పెట్టించాల్సిన నారా లోకేష్ ఢిల్లీ పోయి ఇరవై రోజులు అక్కడే గడిపేశారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత వచ్చే సానుభూతిని సొమ్ము చేసుకోలేకపోయారు అని అంటున్నారు.
ఇరవై రోజుల అనంతరం నారా లోకేష్ తాపీగా ఏపీకి వచ్చారు. మరి ఇన్నాళ్ళు ఆయన ఢిల్లీలో ఏమి చేశారు అంటే ఏమీ లేదు అనే జవాబు వస్తోంది. ఇక దీని మీద టీడీపీ అనుకూల మీడియా అయితే న్యాయ నిపుణులతో లోకేష్ చర్చించడానికి ఢిల్లీ వెళ్లారని చెబుతూ వచ్చింది. ఇది కూడా డొల్ల ప్రచారమే అంటున్నారు. లోకేష్ ని సీఐడీ అరెస్ట్ చేస్తుంది అన్న భయంతోనే ఆయన ఢిల్లీలో ఉన్నారు అన్న మరో ప్రచారం కూడా లోకేష్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే లాగానే ఉంది.
వీటి మీద రాజకీయ విశ్లేషకుడు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అయితే చంద్రబాబు అరెస్ట్ ప్రభావం జాతీయ స్థాయిలో ఏమీ కనిపించలేదని అన్నారు. బాబుని ఎవరూ నమ్మడంలేదని అన్నారు. 2019 ఎన్నికల ముందు బీజేపీకి తలాఖ్ చెప్పి నానా మాటలు మోడీని అమిత్ షాలను అన్న చంద్రబాబు ఆ తరువాత మళ్ళీ మోడీని విజనరీ అని పొగిడినా బీజేపీ పెద్దలు ఏ మాత్రం పట్టించుకోలేదని గుర్తు చేశారు.
అదే విధంగా బాబు 2019 తరువాత విపక్ష శిబిరం వైపు కన్నెత్తి చూడలేదని, ఆయన మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని పేర్కొన్నారు. దీంతో ఇండియా కూటమి నేతలు కూడా బాబు అవకాశవాద రాజకీయాలను గుర్తించి ఆయన్ని దూరం పెట్టారని అన్నారు. ఒకనాడు ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబు చివరికి అరెస్ట్ అయి జైలు గోడల మధ్య ఉన్నా కూడా కనీసంగా ఓదార్పు ఇచ్చేలా ఏ నాయకుడూ రియాక్ట్ కాలేదని అన్నారు.
ఇదంతా బాబు తానుగా స్వయంగా చేసుకున్న అపరాధం అని నాగేశ్వర్ విశ్లేషించారు. చంద్రబాబు ఇపుడు రెండింటికీ చెడిన చందంగా అటు ఎన్డీయే మెప్పు పొందలేక ఇటు ఇండియా కూటమి వారి మద్దతు దక్కించుకోలేకపోయారు అన్నారు. చంద్రబాబు అరెస్ట్ ని ఢిల్లీ స్థాయిలో ఫోకస్ చేసి ఆయనకు కొత్తగా మద్దతు సమీకరించాలని చూసిన లోకేష్ ప్రయత్నం కూడా విఫలం అయింది అన్నారు.
లోకేష్ ని జాతీయ నేతలు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. మమతా బెనర్జీ వంటి వారు మొక్కుబడిగా బాబు అరెస్ట్ మీద రియాక్ట్ అయినా బాబు వంటి నేతలు దొరకాల్సిన భారీ ఓదార్పు అయితే లభించలేదని ఆయన అన్నారు. ఇంకో వైపు చూస్తే లోకేష్ ఢిల్లీ వెళ్ళి సాధించినది ఏదీ లేదని నాగేశ్వర్ అన్నారు.
లోకేష్ తన తండ్రి అరెస్ట్ తరువాత ఏపీలో ఉంటూ పార్టీని ఒక దారిలో పెట్టాల్సిన వేళ వాటిని పక్కన పెట్టి అక్కడ ఉండడం వల్ల రెండిందాల చేటు జరిగిందని అన్నారు. లోకేష్ అరెస్ట్ ని ఢిల్లీలో అయినా చేస్తారని, అయితే ఢిల్లీలో అరెస్ట్ అయితే అది జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతుందని ఆయన భావించినా తెలుగు నేతను తెలుగు మీడియా తప్ప ఎవరూ పట్టించుకోరన్న సంగతి కూడా అర్ధం కాలేదని అన్నారు.
లోకేష్ పార్టీని చక్కదిద్దుతూ ఏపీ నుంచి కూడా జాతీయ మీడియాను ఫోకస్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వవచ్చు అన్నారు. కానీ ఆయన ఢిల్లీ టూరే పొరపాటు అన్నది నాగేశ్వర్ మాటలలో వెల్లడైంది. ఇక చంద్రబాబు అరెస్ట్ తరువాత లాయర్లకు న్యాయ సలహాలు ఇచ్చేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లారన్న దాని మీద కూడా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి లీగల్ సెల్ ఉందని, లాయర్లు చాలా మంది ఉన్నారని వారే సుప్రీం కోర్టు లాయర్లకు తగిన సలహాలు ఇస్తారని అన్నారు. అంతే కాదు ములాఖత్ ద్వారా చంద్రబాబు కూడా సలహాలు ఇచ్చే వీలుందని అన్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే లోకేష్ మాత్రం ఢిల్లీలో విలువైన సమయం అంతా గడిపేశారన్న భావనను నాగేశ్వర్ వ్యక్తం చేశారు. మొత్తానికి బాబుని ఏ రాజకీయ పార్టీ నమ్మలేదని, అందుకే ఆయన అరెస్ట్ పట్ల ఎక్కడా సరైన రియాక్షన్ అయితే రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.