ర్యాలీ కోసం ఫోన్ చేసిన లోకేష్... కేటీఆర్ అసహనం?
అయితే ఈ నిరసన కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. దీంతో ఈ విషయమై లోకేష్ తనకు ఫోన్ చేశారని చెబుతూ... అసహనం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్!
By: Tupaki Desk | 26 Sep 2023 2:55 PM GMTస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన అరెస్టై నేటికు సుమారు 18 రోజులు కావొస్తుంది! ఈ క్రమంలో హైదరాబాద్ లో పలువురు ఐటీ ఉద్యోగులు గచ్చిబౌలి, సైబర్ టవర్స్ ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టే పనికి పూనుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ విషయంలో నిరసనలకు, ర్యాలీలకూ ఎలాంటి అనుమతులూ లేవని చెప్పిన పోలీసులు... ఐటీ ఉద్యోగులను అడ్డుకున్నారు. అనుమతులకోసం ప్రయత్నించినా అందుకు తెలంగాణ పోలీస్ అంగీకరించలేదు! అయితే ఈ విషయమై తాజాగా కేటీఆర్ స్పందించారు. ఈ విషయమై లోకేష్ తనకు ఫోన్ చేశారని అన్నారు.
అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు నిరసనలకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిరసన కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. దీంతో ఈ విషయమై లోకేష్ తనకు ఫోన్ చేశారని చెబుతూ... అసహనం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్!
లోకేష్ కు సమాధానంగా.. ఇక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలగొద్దని, ఎవరికీ అనుమతి ఇవ్వమని చెప్పానని కేటీఆర్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న ఐటీ డిస్ట్రబ్ కావొద్దని తెలిపారు. ఈ సమయంలో అది రెండు రాజకీయ పార్టీల అంశంలా ఉందన్న ఆయన.. ఏపీ రాజకీయాలకు, తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు.
అనంతరం... ఇక్కడ ర్యాలీలు ఎందుకు? ఏపీలో చేస్కోండి.. రాజమండ్రిలో భూమి బద్దలు కొట్టేలా ర్యాలీలు చేసుకోండి అంటూ సలహా ఇచ్చారు కేటీఆర్. ఇది రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం అని, దానివల్ల హైదరాబాద్ లో ఐటీ డిస్టర్బ్ కావడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఏపీలో ఉన్న సమస్యపై హైదరాబాద్ లో కొట్లాడతా అంటే ఎలా అని ప్రశ్నించిన ఆయన... ఇది సరైంది కాదని అన్నారు. ఇక్కడ మేం ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. శాంతిభద్రతల సమస్య వస్తే ఎలా అని అడిగారు. ఇదే సమయలో ఆ రెండు పార్టీలకు తెలంగాణలో ఉనికి లేదని అన్నారు.
ఇదే క్రమంలో తనకు లోకేష్.. జగన్.. పవన్ కల్యాణ్ లు మంచి స్నేహితులని, ముగ్గురూ దోస్తులే అని తెలిపిన కేటీఆర్... ఆంధ్రాలో తనకు తగాదాలు లేవని, ఇదే సమయంలో ఇప్పటికిప్పుడు యుద్ధాలు చేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ లో అందరూ కలిసి మెలసి ఉంటున్నామని, ఇక్కడ లేని పంచాయితీలు ఎందుకు పెట్టాలని అన్నారు.