నిన్ను కట్ డ్రాయర్ తో నడిపిస్తా: లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యంగా గత ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరఫున గెలిచి వైసీపీలోకి ఫిరాయించిన వల్లభనేని వంశీని, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని లోకేశ్ చేసిన వ్యాఖ్యలు కాకరేపాయి.
By: Tupaki Desk | 23 Aug 2023 5:57 AM GMTటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర 2500 కిలోమీటర్లు దాటింది. కృష్ణా జిల్లాలో లోకేశ్ పాదయాత్ర సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా గన్నవరం సభలో ఆయన నిప్పులు చెరిగారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరఫున గెలిచి వైసీపీలోకి ఫిరాయించిన వల్లభనేని వంశీని, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని లోకేశ్ చేసిన వ్యాఖ్యలు కాకరేపాయి.
తన తల్లిని శాసనసభగా అవమానించిన కొడాలి నానిని కట్ డ్రాయర్ మీద నడిపిస్తానని లోకేశ్ హెచ్చరించారు. అలాగే గన్నవరంలో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన వల్లభనేని వంశీని వదిలిపెట్టేది లేదని.. పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
''సన్న బియ్యం సన్నాసి మంత్రి అయ్యాడు. గుట్కా తినడం తప్ప వాడికి మరేమీ చేతకాదు. నా తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించిన కొడాలి నానిని గుడివాడలో కట్ డ్రాయర్ తో నడిపిస్తాం. ఇంకోసారి మరో తల్లి గురించి మాట్లాడాలంటే భయపడేలా చేస్తాం'' అని కొడాలి నానిపై లోకేశ్ నిప్పులు చెరిగారు.
''గన్నవరంలో ఓ పిల్ల సైకో ఉన్నాడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా చాంబర్ కొచ్చి సార్ సార్ అంటుండేవాడు. కూర్చొవయ్యా అంటే.. వద్దు సార్ అనేవాడు. పిల్ల సైకో చాలా పెద్ద నటుడు. పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తా. తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. గన్నవరం. పుచ్చలపల్లి సుందరయ్య, దాసరి బాలవర్ధన్‌రావు వంటి ఎంతోమంది గొప్పవాళ్లు గన్నవరం ఎమ్మెల్యేలుగా చేశారు. ఇంత చరిత్ర ఉన్న గన్నవరంలో మేం చేసిన తప్పు వల్ల ఇక్కడొక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యాడు. గన్నవరం ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. మళ్లీ అలాంటి తప్పు చేయం. తన గెలుపు కోసం పనిచేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి మరీ వంశీ జైలుకు పంపించాడు. గన్నవరం పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తా. నిజమైన షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చే బాధ్యత నాది'' అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అలాగే దేవాదాయ శాఖ నిర్వహించడం తెలియని వ్యక్తి కొబ్బరి చిప్పల దొంగ మంత్రి అయ్యాడని వెలంపల్లి శ్రీనివాసరావుపై లోకేశ్ విరుచుకుపడ్డారు. 'జోకర్ జోగి.. చంద్రబాబు ఇంటి మీదకు వస్తాడా..? ఇప్పుడు రా బిడ్డా. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం' అని మంత్రి జోగి రమేశ్ కు సవాల్ విసిరారు.
టీడీపీ నేతలు, కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడానికి జుడీషియల్ ఎంక్వైరీ వేస్తామని లోకేశ్ హెచ్చరించారు. దొంగ కేసులు పెట్టిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాశామని.. మరో తొమ్మిది నెలల్లో అధికారంలోకి రాగానే వీళ్ల భరతం పడతాం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
జగన్ పాదయాత్ర చేసినప్పుడు తమ ప్రభుత్వంలో ఎవరూ అడ్డుకోలేదని లోకేశ్ గుర్తు చేశారు. పోలీసు భద్రత కల్పించి మరీ పాదయాత్ర చేసుకోమన్నామని తెలిపారు. అయితే తాను యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. రకరకాలుగా అడ్డుకోవాలని ప్రయత్నించినా.. వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పానన్నారు. ఇప్పుడు ఈ సైకోలు బ్యానర్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. సాగనిస్తే పాదయాత్ర అని అడ్డుకుంటే ఇది దండయాత్ర అవుతుందని లోకేశ్ హెచ్చరికలు జారీ చేశారు.
''తిరుమల భక్తులకు కర్రలు ఇస్తారట. కర్రలు భక్తులకు కాదు.. వైసీపీ నేతలను తరమడానికి ప్రజలకివ్వాలి. కరెంట్ ఛార్జీలు, నిత్యావసర ధరలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. గాలి మీద కూడా పన్ను వేస్తారు. జగన్ కటింగ్–ఫిటింగ్ మాస్టర్. దేశంలో వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి సైకో జగన్. దళితులపై దాడులు చేసి అవమానిస్తున్నారు. ఓ దళిత యువకుడు మంచి నీళ్లు అడిగితే మూత్రం పోశారు'' అని లోకేశ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా లోకేశ్ పై విరుచుకుపడే కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేశ్, వెలంపల్లి శ్రీనివాసరావు.. కౌంటర్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.