అభ్యర్థుల జాబితాపై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు!
నారా లోకేశ్ గత ఎన్నికల్లో బరిలోకి దిగిన గుంటూరు జిల్లా మంగళగిరి నుంచే మరోసారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.
By: Tupaki Desk | 25 Feb 2024 6:33 AM GMTటీడీపీ, జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి విడత జాబితాలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణలకు సీట్లు దక్కాయి.
నారా లోకేశ్ గత ఎన్నికల్లో బరిలోకి దిగిన గుంటూరు జిల్లా మంగళగిరి నుంచే మరోసారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని వెల్లడించారు.
తాజాగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రత్యేక ప్రతిభావంతులతో మాట్లాడారు. అనంతరం మంగళగిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 180 కుటుంబాలు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరాయి.
ఈ సందర్భంగా లోకేశ్ హాట్ కామెంట్స్ చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే తప్ప వైసీపీ ప్రభుత్వం మంగళగిరికి చేసిందేమీ లేదన్నారు. ఈ సారి ఎన్నికలు ‘వార్ వన్ సైడే’ అన్నట్లుంటాయని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజాభిప్రాయం తెలుసుకున్నాకే టీడీపీ అభ్యర్థులను ప్రకటించారని లోకేశ్ వెల్లడించారు.
గత ఐదేళ్లుగా మంగళగిరి నియోజకవర్గంలో తన పనితీరు బాగుంది కాబట్టి తనకు సీటు కేటాయించారని లోకేశ్ తెలిపారు. తాను పాదయాత్ర చేసిన సమయం మినహా మిగిలిన అన్ని రోజులు మంగళగిరి నియోజకవర్గంలోనే ఉన్నానని తెలిపారు. వైసీపీ పని అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తేల్చిచెప్పారు.
ఈ నేపథ్యంలో లోకేశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పనితీరు, పార్టీలో ప్రతిభ ఆధారంగానే సీట్లు కేటాయించారని చెప్పడమే లోకేశ్ ఉద్దేశం అంటున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5300 ఓట్ల తేడాతో ఓడిన లోకేశ్ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇప్పటికే ఆయన మంగళగిరి నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. మరోవైపు లోకేశ్ భార్య బ్రాహ్మణి సైతం ప్రజలను కలుస్తున్నారు. లోకేశ్ ను గెలిపించాలని పిలుపునిస్తున్నారు.