జిల్లాకో వైసీపీ ప్యాలెస్.. ఏకేసిన మంత్రి లోకేష్!
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండను తొలిచి.. అక్కడ భారీ భవంతిని నిర్మించిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 23 Jun 2024 12:31 PM GMTవైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండను తొలిచి.. అక్కడ భారీ భవంతిని నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ టాపిక్ హాట్ హాట్‌గానే సాగుతోంది. దాదాపు 500 కోట్ల మేరకు దీనికి ఖర్చు చేశారని అంటున్నారు. అయితే.. అంతకు మించే ఖర్చయి ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. మొత్తంగా ఇంద్రభవనాన్ని మించిన హంగులతో రుషికొండపై భవనాన్ని నిర్మించారు. మూడు సంవత్సరాల పాటు సాగిన ఈ నిర్మాణం విషయాన్ని వైసీపీ సర్కారు అత్యంత రహస్యంగా ఉంచింది.
తాజాగా వచ్చిన కూటమి ప్రభుత్వం రుషికొండలో ఏం జరుగుతోందన్న విషయం బయట ప్రపంచానికి తెలియజేసింది. అయితే.. వైసీపీ రాజభవనాల ముచ్చట ఇక్కడితో అయిపోలేదని.. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల పేరుతో నిర్మించిన రాజభవనాలకు సంబంధించిన ఫొటోలను నారా లోకేష్ షేర్ చేశారు.
రుషికొండలో నిర్మించిన ఒక్క ప్యాలెస్.. ఏకంగా 25 వేల ఇళ్లకు సమానమని నారా లోకేష్ తెలిపారు. ఇదే సమయంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల కోసం.. 42 ఎకాల స్థలాన్ని కేటాయించుకున్నారని చెప్పారు. దీనికిగాను ఏకరాకు రూ.1000 చొప్పున లీజుకు కేటాయించుకున్నారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మెగా భవనాల నిర్మాణం జరుగుతోందన్నారు. జగన్ నిర్మించిన ఒక్కొక్క ప్యాలెస్ కు 500 కోట్లు ఖర్చయ్యాయని.. ఆ సొమ్ముతో 25 వేల ఇళ్లు నిర్మించుకోవచ్చని తెలిపారు.
తన వ్యక్తిగత కోరికలను తీర్చుకునేందుకు ప్రజా ధనాన్ని జగన్ దుర్వినియోగం చేశారని మంత్రి నారా లోకేష్ దుయ్యబట్టారు. ఒకవైపు రాష్ట్రం అప్పుల పాలై.. ఆదాయం లేని పరిస్థితిలో ఇలాంటి విలాస వంతమైన భవనాలను నిర్మించుకోవడం.. అవసరమా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నారా లోకేష్.. ఆయా జిల్లాలలో నిర్మాణంలో ఉన్న విలాస వంతమైన భవనాలను తలపించే వైసీపీ ఆఫీసుల నిర్మాణాల ఫొటోలను షేర్ చేశారు.