జగన్ గుర్తులు మొత్తం చెరిపేసిన లోకేష్ !
అందుకే ఆయన పాత ప్రభుత్వం గురుతులు లేకుండా చూడాలని గట్టి పట్టుదల మీదనే ఉన్నారు.
By: Tupaki Desk | 28 July 2024 3:35 AM GMTవిద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఐటీ ఆయన చేతిలోనే ఉంది. లోకేష్ విద్యా శాఖలో తనదైన ముద్ర ఉండాలని చూస్తున్నారు. అందుకే ఆయన పాత ప్రభుత్వం గురుతులు లేకుండా చూడాలని గట్టి పట్టుదల మీదనే ఉన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం అవసరం ఉన్నా లేకున్నా అనేక పధకాలకు జగనన్న అని పేరు తగిలించింది. అలా జగన్ పేరు మారుమోగాలని వారు తపన పడ్డారు. ఇది ఒక దశను దాటిపోయి రోత పుట్టేలా చేసిందన్న విమర్శలూ ఉన్నాయి. ఈ నేపధ్యంలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టింది.
టీడీపీ కూటమి ప్రభుత్వం జగన్ పేర్లను ఎందుకు ఉంచుతుంది అన్నది సహజంగానే అందరికీ కలిగే డౌట్. అయితే దానినే నిజం చేస్తూ చాలా పేర్లను ప్రభుత్వం మార్చింది. ఇక విద్యా శాఖలో ప్రక్షాళన దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేశారు. ఈ క్రమంలో ఆయన తన శాఖలో అరడజను పైగా ఉన్న పథకాలు జగన్ పేర్లని తొలగిస్తూ కీలక నిర్ణయమే తీసుకున్నారు.
అవేంటో చూస్తే కనుక జగనన్న అమ్మ ఒడి పధకానికి తల్లికి వందనం అని పేరు మార్చారు. ఇది ఎన్నికల టైం లోనే మార్చారు. ఇక జగనన్న విద్యా కానుక పధకానికి సర్వేపల్లి రాధాక్రిష్ణన్ విద్యార్ధి మిత్రగా మార్చారు జగనన్న గోరుముద్ద పధకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం గా మార్చారు. మన బడి నాడు మనబడి నేడు అన్న పధకానికి మన భవిష్యత్తుగానూ, స్వేచ్చ అన్న దానికి బాలికా రక్ష, జగనన్న ఆణిముత్యాలు అన్న పధకానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేరు మార్చినట్లుగా లోకేష్ చెప్పారు.
మొత్తం మీద చూస్తే ఎక్కడా జగన్ అన్న ఆనవాళ్ళు లేకుండా ఆయన పేరు కనబడకుండా ఈ పధకాలను మార్చి తీర్చిదిద్దుతున్నారు ఈ విషయాన్ని స్వయంగా మంత్రి లోకేష్ ప్రకటించారు. జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పధకాలను స్వస్తి పలుకుతున్నామని ఆయన పేర్కొన్నారు.