పెద్ద మాస్టార్ గా నారా లోకేష్!
ఈ శాఖ కింద ప్రాధమిక ఎలిమెంటరీ పాఠాశాలతో పాటు విశ్వవిద్యాలయాల గురించి కూడా చూడాల్సి ఉంది.
By: Tupaki Desk | 17 Jun 2024 4:21 AM GMTతెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ కి ప్రాధాన్యత కలిగిన మంత్రిత్వ శాఖలు లభించాయి. ఆయనకు ఐటీ శాఖ ఇచ్చారు. అది గతంలో చేసినదే. ఇపుడు అదనంగా మానవవనరుల శాఖ ఇచ్చారు. ఏపీలో 2014 నుంచి మానవవనరుల శాఖ కింద ప్రాధమిక ఉన్నత శాఖలను కలిపేసి ఒకే గొడుగు కిందకు చేర్చారు అంటే కేజీ నుంచి పీజీ వరకూ ఒకే మంత్రి గారే చూస్తారు అన్న మాట. టీడీపీ ప్రభుత్వంలో అయిదేళ్ల పాటు గంటా శ్రీనివాసరావు ఈ శాఖను నిర్వహించగా వైసీపీ ప్రభుత్వంలో తొలి మూడేళ్ళూ ఆదిమూలం సురేష్ చివరి రెండేళ్ళూ బొత్స సత్యనారాయణ ఈ శాఖను చూసారు.
ఇపుడు లోకేష్ కి చంద్రబాబు ఏరి కోరి ఇచ్చారు. ఈ శాఖ కింద ప్రాధమిక ఎలిమెంటరీ పాఠాశాలతో పాటు విశ్వవిద్యాలయాల గురించి కూడా చూడాల్సి ఉంది. చాలా పెద్ద శాఖ. దాంతో లోకేష్ ఈ శాఖ మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఏపీలో లక్షా పాతిక వేల పై దాటి ఉపాధ్యాయులు ఉన్నారు. వీరితో పాటు లెక్చరర్లు వేలల్లో ఉన్నారు.విశ్వవిద్యాలయాలలో పనిచేసే అధ్యాపకులు ప్రొఫెసర్లు కూడా వేలల్లో ఉన్నారు
వీరందరికీ సరైన దిశా నిర్దేశం చేయాల్సిన శాఖ మానవ వనరుల శాఖ. అంతే కాదు ఏపీలో పదుల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల పనితీరుని మధింపు చేయడం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఉప కులపతుల నియామకం విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇలా చాలా బాధ్యతలు ఉంటాయి.
వైసీపీ ప్రభుత్వం ఫేస్ రికగ్నైజేషన్ నిబంధన పెట్టడంతో ఉపాధ్యాయులు వ్యతిరేకంగా మారారు అన్న ప్రచారం ఉంది. మరి ఈ విషయంలో కొత్త విద్యా మంత్రి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. అలా మారు మూల ప్రభుత్వ పాఠశాలలకు టీచర్లు సక్రమంగా వెళ్తున్నారా లేదా అన్నది చెక్ చేయడానికి ఏ రకమైన నిఘా వ్యవస్థ అనుసరిస్తారో చూడాలి. టీడీపీ ఇచ్చిన కీలక హామీలలో ఒకటైన తల్లికి వందనం హామీ లోకేష్ మంత్రిత్వ శాఖలోకే వస్తుంది. దాని వల్ల వచ్చే పేరు కూడా ఆయనకే దక్కుతుంది.
అలాగే ఇంగ్లీష్ బోధన ఉండాలా వద్దా అన్న డెసిషన్ మీద కూడా అంతా చూస్తున్నారు. బై జ్యూస్ నుంచి కంటెంట్ తీసుకుని విద్యా బోధన చేస్తున్నామని గత ప్రభుత్వం చెప్పేది. దానిని కంటిన్యూ చేస్తారా లేదా అన్నది చూడాలి. టీచర్ల బదిలీలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద కొత్త విద్యా మంత్రి ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అన్నది కూడా చూడాల్సి ఉంది. నాడు నేడు కింద గత ప్రభుత్వం కొన్ని పాఠశాలలను బాగు చేసామని చెప్పింది.మరిన్ని దశలు ఉన్నాయి వాటిని కొనసాగిస్తారా అసలు వాటికి అయ్యే ఖర్చు ఎంత ప్రయోజనం ఎంత అన్నది కూడా సమీక్ష చేయాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు ఎక్కువగా హాజరయ్యేలా చూడాలని లోకేష్ తన తొలి సమీక్షలో అధికారులను ఆదేశించారు.
ఇక జగన్ ప్రభుత్వానికి తొలి నిరసన టీచర్ల నుంచే వచ్చింది. ఇపుడు టీడీపీని అధికారంలోకి తెచ్చుకున్నది కూడా టీచర్లే. వారంతా గురువులు. కేవలం 42 ఏళ్ల వయసులో లోకేష్ పెద్ద మాస్టారు అవతారం ఎత్తబోతున్నారు. ఆయన ఈ బాధ్యతతో ఏ విధంగా విద్యా రంగంలో సంస్కరణలు తెస్తారు, లక్షలాది మంది టీచర్ల మన్ననలు ఎలా అందుకుంటారు అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా లోకేష్ కి ఈ శాఖ చాలా సవాల్ గానే ఉంటుంది అని అంటున్నారు.