Begin typing your search above and press return to search.

స్కిల్స్ స్కాం... రిమాండ్‌ రిపోర్ట్‌ లో సంచలన విషయాలు!

సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి రిమాండ్‌ రిపోర్టును సీఐడీ.. కోర్టుకు సమర్పించింది.

By:  Tupaki Desk   |   10 Sep 2023 8:27 AM GMT
స్కిల్స్ స్కాం... రిమాండ్‌ రిపోర్ట్‌ లో సంచలన విషయాలు!
X

సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి రిమాండ్‌ రిపోర్టును సీఐడీ.. కోర్టుకు సమర్పించింది. ఇందులో భాగంగా స్కిల్‌ స్కాంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారుడని సీఐడీ పేర్కొంది. ఈ రిపోర్ట్ లో చంద్రబాబుపై నేరపూరిత కుట్ర, ప్రజాధనం దుర్వినియోగం, మోసం అభియోగాలు ఉన్నాయి.

అవును... శనివారం ఉదయం ఆరు గంటలకు చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్‌ చేసిన విషయాన్ని ఈ రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్న ఏపీ సీఐడీ... స్కిల్‌ స్కాంలో రూ.550 కోట్ల కుంభకోణం జరిగిందని తెలిపింది. ఇదే సమయంలో... ప్రభుత్వ సొమ్మును ఫేక్‌ ఇన్వాయిస్‌ లు, షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించారని తెలిపింది.

ఇక రిమాండ్‌ రిపోర్టు లో నారా లోకేష్‌ పేరును సీఐడీ ప్రముఖంగా ప్రస్తావించింది. చంద్రబాబు కు సన్నిహితుడైన కిలారి రాజేశ్‌ ద్వారా లోకేష్‌ కు డబ్బులు అందాయని రిపోర్ట్ లో సీఐడీ పేర్కొంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ లో లోటు పాట్లు, తప్పిదాలు ఉన్నప్పటికీ చంద్రబాబు, అచ్చెన్నాయుడు కలిసి ఓకే చేశారని తెలిపింది.

ఇదే సమయంలో స్కిల్‌ ప్రాజెక్టులో సిమెన్స్‌ కంపెనీ రూ.3281 కోట్లు గ్రాంట్‌ గా ఇస్తుందని చంద్రబాబు, అచ్చెన్నాయుడు అబద్ధాలు చెప్పారని ఏపీ సీఐడీ తన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఈ స్కాం లో ప్రభుత్వానికి రూ.300 కోట్లు మేర నష్టం జరిగింది.. ఒప్పందం ఉల్లంఘిస్తూ రూ.371 కోట్ల అడ్వాన్సులు చెల్లింపు చేశారని పేర్కొంది.


అదేవిధంగా... ప్రభుత్వ నిధుల్లో భారీ మొత్తం షెల్‌ కంపెనీలకు తరలించారని.. చంద్రబాబు డైరెక్షన్‌ లోనే ప్రభుత్వం నిధులు షెల్‌ కంపెనీలకు మళ్లించారని సీఐడీ తెలిపింది. ఇదే సమయంలో నాటి ఈ ఒప్పందాన్నికి సంబంధించిన కీలక డాక్యుమెంట్ల మాయం వెనుక చంద్రబాబు హస్తం ఉందని.. కాబట్టి మరింత విచారణకు చంద్రబాబును కస్టడీకి తీసుకోవాల్సి ఉందని సీఐడి కోరింది.

ఇదే సమయంలో ప్రస్తుతం అమెరికా పారిపోయినట్లుగా చెబుతున్న చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌ పేరును కూడా రిమాండ్ రిపోర్ట్ లో సీఐడి ప్రస్థావించింది. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు ముడుపులు అందాయని తెలిపింది. ఇదే సమయంలో ఈ స్కిల్‌ స్కాంకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుపుతోందని వెల్లడించింది.

ఫలితంగా... ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే పలువురిని అరెస్ట్‌ చేశారని.. స్కిల్‌ స్కాంలో ఈడీ విచారణ కీలక దశలో ఉందని వెల్లడించింది. ఇందులో భాగంగానే మనోజ్‌ వాసుదేవ్‌ కు సెప్టెంబర్‌ 5న నోటీసులు ఇచ్చామని, అయితే నొటీసులకు జవాబు ఇవ్వకుండా విదేశాలకు పారిపోయారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. వీళ్లను చంద్రబాబే కాపాడుతున్నారనేది తమ అనుమానం అని ఏపీ సీఐడీ కోర్టుకు తెలిపింది.