Begin typing your search above and press return to search.

ఆ కాపు నేతను వద్దన్న లోకేశ్‌!

2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీలో చేరారు. చీరాల అసెంబ్లీ సీటును దక్కించుకున్నారు

By:  Tupaki Desk   |   11 July 2024 7:34 AM GMT
ఆ కాపు నేతను వద్దన్న లోకేశ్‌!
X

ప్రకాశం జిల్లాలో కాపు సామాజికవర్గంలో కీలక నేత.. ఆమంచి కృష్ణమోహన్‌. ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ప్రియ శిష్యుడిగా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్‌ గెలుపు బావుటా ఎగురవేశారు. ఏపీ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ (నవోదయం పార్టీ)గా పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత నాటి అధికార టీడీపీలో చేరారు.

2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీలో చేరారు. చీరాల అసెంబ్లీ సీటును దక్కించుకున్నారు. ఆ సందర్భంగా టీడీపీలో కాపులకు ప్రాధాన్యత లేదని.. కాపులను అణగదొక్కుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులుతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజికవర్గాన్ని సమీకృతం చేసే ప్రయత్నం కూడా చేశారు.

అయితే విచిత్రంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గాలి ప్రభంజనంలా వీచినా చీరాల నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్‌ ఓడిపోయారు. నాటి నుంచి చీరాల వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా వ్యవహరించారు.

అయితే నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ఆధిపత్య పోరును ఎదుర్కొన్నారు. మరోవైపు చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కరణం బలరాం తదనంతర పరిణామాల్లో వైసీపీలో చేరారు. కరణం బలరాం కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. అటు కరణం, ఇటు ఆమంచి చీరాల నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోటీ పడటంతో ఆమంచి కృష్ణమోహన్‌ ని వైసీపీ అధినేత జగన్‌ పర్చూరు ఇంచార్జిగా పంపారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల సీటును జగన్‌... సిట్టింగ్‌ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేశ్‌ కు కేటాయించారు. ఈ నేపథ్యంలో జగన్‌.. ఆమంచి కృష్ణమోహన్‌ కు ఎక్కడా సీటు కేటాయించలేదు. ఆయన ఇంచార్జిగా పనిచేసిన పర్చూరుకు సైతం యడం బాలాజీని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆమంచి ఎటూ కాకుండా పోయారు.

దీంతో మళ్లీ చీరాల నుంచి ఇండిపెండెంట్‌ గా పోటీ చేయాలని భావించినా∙చివరకు కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ఆమంచి కృష్ణమోహన్‌ పోటీ చేశారు. దాదాపు 41 వేలకు పైగా ఓట్లను సాధించారు. తద్వారా వైసీపీ ఓట్లలో చీలిక తెచ్చారు. దీంతో టీడీపీ అభ్యర్థి మాలకొండయ్య యాదవ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్‌ లో ఉన్న ఆమంచి మళ్లీ టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, తదితర టీడీపీ నేతల ద్వారా ఆయన రాజకీయం నడుపుతున్నారని సమాచారం. గొట్టిపాటి రవి ఈ విషయాన్ని నారా లోకేశ్‌ కు చెప్పగా ఆయన ఆమంచి కృష్ణమోహన్‌ ను చేర్చుకోవడానికి నిరాకరించినట్టు సమాచారం.

గతంలో తనను, తన తండ్రి చంద్రబాబును విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారని లోకేశ్‌ గుర్తు చేశారని తెలుస్తోంది. అలాగే కులపరంగానూ కమ్మ సామాజికవర్గంపై అసభ్య వ్యాఖ్యలు చేశారని.. అందువల్ల ఆమంచి కృష్ణమోహన్‌ లాంటి వ్యక్తులను టీడీపీలో చేర్చుకునేది లేదని లోకేశ్‌ స్పష్టం చేసినట్టు సమాచారం.

టీడీపీలో చేరికకు చంద్రబాబు, లోకేశ్‌ ఒప్పుకుంటే చీరాలలో మళ్లీ చక్రం తిప్పుదామని ఆమంచి కృష్ణమోహన్‌ భావించారు. ముఖ్యంగా ప్రస్తుత చీరాల టీడీపీ ఎమ్మెల్యే మాలకొండయ్య యాదవ్‌ కు చెక్‌ పెట్టి తన హవా చూపాలని భావించారని తెలుస్తోంది. అయితే ఆమంచి ఆశలకు లోకేశ్‌ బ్రేకులు వేయడంతో ఆయన ఆశలు నీరుగారిపోయాయి.