హైదరాబాద్‌లో భూముల ధరలు పెరిగాయి.. ఏ కులం పెంచింది జగన్?
అంతేకాదు.. మార్కెట్ వాల్యూ అనేది.. వస్తున్న పెట్టుబడులు, బ్రాండ్ వాల్యూను బట్టి ఉంటుందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 14 Aug 2023 5:57 AM GMTఏపీ రాజధాని అమరావతిపై తరచుగా మాట్లాడే వైసీపీ నాయకులు.. ఇక్కడ ఒక సామాజిక వర్గం కారణంగా నే భూముల ధరలు పెరిగాయని చెప్పిన విషయంపై తాజాగా టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. "హైదరాబాద్‌లో భూముల ధరలు కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. ఇవి ఏ కులం పెంచింది" అని ప్రశ్నించారు. అంతేకాదు.. మార్కెట్ వాల్యూ అనేది.. వస్తున్న పెట్టుబడులు, బ్రాండ్ వాల్యూను బట్టి ఉంటుందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
ఏపీలో గత ప్రభుత్వం ఈ బ్రాండ్ వాల్యూను పెంచి, పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించిన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరిగాయని.. దీనికి ఏ కులమూ కారణం కాదని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో సాగుతున్న యువగళం పాదయాత్ర సందర్భంగా ఇక్కడి రైతులు, ప్రజాప్రతినిధులతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే భూముల ధరల విషయం ప్రస్తావనకు వచ్చింది.
"రాజధాని అమరావతిలో ఒక సామాజిక వర్గం మాత్రమే పాగా వేయాలని భావించింది. అందుకే ఇక్కడి భూముల ధరలు పెరిగిపోయాయి. పేదలకు, మధ్యతరగతి వారికి భూముల ధరలు అందుబాటులో లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇలా చేశారు" అని సీఎం జగన్ గతం చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా నారా లోకేష్ చెప్పారు. అయితే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఉన్న పలు ప్రాంతాల్లో ప్రభుత్వం భూములు వేలం వేస్తున్న విషయాన్ని ఆయన తెరమీదికి తెచ్చారు.
కోకా పేటలో ఎకరం భూమి 100 కోట్ల కన్నా ఎక్కువే పలికిందని.. మరి దీని వెనుక ఏకులం ఉందని.. ఏ కులం ఆధారంగా 100 కోట్ల ధర పలికిందని నారా లోకేష్ ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పాలని ఆయన వైసీపీ నాయకులకు సవాల్ రువ్వారు. హైదరాబాద్‌లో శివారు ప్రాంతాల్లో పారిశ్రామిక అబివృద్ధి, ఐటీ అబివృద్ధి జరుగుతోందని.. అందుకే.. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతున్నాయని.. ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు హయాంలో ఉందని.. ఇప్పుడు లేకుండా పోయిందని.. వ్యాఖ్యానించారు.
టీడీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఫ్యాక్స్ కాన్ కంపెనీని వైసీపీ నాయకులు తరిమేశారని.. ఇప్పుడు అది కర్ణాటకకు పోయిందని.. దీనిని ఏ మతం తీసుకువెళ్లిందని ప్రశ్నించారు. ఏపీలో కష్టపడి గత ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు తీసుకువచ్చిన పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య వైసీపీ నాయకులు, సీఎం జగన్ చిచ్చు పెడుతున్నారని లోకేష్ దుయ్యబట్టారు.