Begin typing your search above and press return to search.

మా ప్రభుత్వం రాగానే అమరావతి రీస్టార్ట్: లోకేష్

సభ గ్రాండ్ సక్సెస్ అయిందని, సభకు తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నానని లోకేష్ అన్నారు.

By:  Tupaki Desk   |   18 March 2024 5:50 PM GMT
మా ప్రభుత్వం రాగానే అమరావతి రీస్టార్ట్: లోకేష్
X

బొప్పూడి లో జరిగిన ప్రజా గళం బహిరంగ సభ విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సభ విజయవంతం కావడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్నటి సభతో ఏపీకి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలన్న సంకల్పం మరింత బలపడిందని లోకేష్ చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనం అయిందని, ఆంధ్రప్రదేశ్ ను మళ్ళీ గాడిలో పెట్టేందుకు టిడిపి, జనసేన, బిజెపి కూటమి, ప్రజలు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. సభ గ్రాండ్ సక్సెస్ అయిందని, సభకు తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నానని లోకేష్ అన్నారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని అమరావతిని నాశనం చేశాడని లోకేష్ ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి ప్రాంతంలో స్వర్ణకారుల కోసం ప్రత్యేక సెజ్ తీసుకువస్తామని మాటిచ్చారు. ఇక, స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలాగా చర్యలు చేపడతామని కూడా లోకేష్ స్థానికులకు భరోసానిచ్చారు. మంగళగిరి ఎల్ఈపిఎల్ అపార్ట్మెంట్ వాసులతో, నియోజకవర్గంలోని పలు వర్గాలకు చెందిన తటస్థులతో నిర్వహించిన ముఖాముఖిలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారుస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పుకొచ్చారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా లోకేష్ మాట్లాడారు. ఇప్పటికే టాటా ట్రస్ట్ ద్వారా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించే పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇది సక్సెస్ అయితే తాము అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని లోకేష్ అన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. బీసీలకు అన్ని విధాల అండగా నిలిచేది టిడిపి అని, రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని లోకేష్ కోరారు. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, కానీ, జగన్ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని మైనారిటీ సోదరులతో మాట్లాడుతూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.