అసెంబ్లీలో అంతా లోకేషే !
ఇక టీడీపీ జనసేన సభ్యుల ఉత్సాహం అయితే పట్టరానంతగా మారింది.
By: Tupaki Desk | 21 Jun 2024 7:55 AM GMTఏపీ కొత్త అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి కోలాహల వాతావరణంలో సాగింది. సభ మొత్తం టీడీపీ కూటమి సభ్యులు పరచుకున్నారు. ఇక టీడీపీ జనసేన సభ్యుల ఉత్సాహం అయితే పట్టరానంతగా మారింది.
చంద్రబాబు ప్రమాణం చేసినపుడు అలాగే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ప్రమాణం చేసినపుడు సభ నినాదాలతో దద్దరిల్లింది. మంత్రులు అంతా వరసబెట్టి ప్రమాణం చేశాక విపక్ష నేతగా జగన్ కి చాన్స్ వచ్చింది. అయితే జగన్ చాలా ముభావంగా కనిపించారు. ఆయన ప్రమాణం చేస్తున్నంతసేపూ సభలో అదొక రకమైన నిశ్శబ్దం కనిపించింది.
మరో వైపు చూస్తే సభ అంతా జగన్ వైపే చూస్తూ కనిపించింది. జగన్ ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పలకరించినపుడు మాత్రమే చిరు నవ్వు నవ్వారు. మొత్తానికి జగన్ సభలో ప్రమాణం మాత్రం ఒక సైలెంట్ వాతావరణాన్నే కలిగించింది.
ఇంకో వైపు చూస్తే సభలో 135 మంది టీడీపీ సభ్యులు ఉన్నారు. వీరిలో మంత్రులు అయిన వారు మాజీ మంత్రులు సీనియర్ నేతలు ఇలా ఎవరు ప్రమాణం చేసినా వెంటనే లోకేష్ వద్దకు వచ్చి ఆయనతో కరచాలనం చేయడం ఆయనతో మాట్లాడటం కనిపించింది సభా నాయకుడిగా చంద్రబాబు ఉన్నా టీడీపీ మొత్తం భావి నాయకుడిగా లోకేష్ నే చూస్తోంది అనడానికి ఈ ప్రమాణ స్వీకారం వేళ కనిపించిన దృశ్యాలే నిదర్శనం అని అంటున్నారు.
లోకేష్ సైతం తన వద్దకు వచ్చిన ప్రతీ టీడీపీ ఎమ్మెల్యే భుజం తట్టి ఆప్యాయతతో పలకరించారు. మొత్తం పార్టీ లోకేష్ వెంట ఉంది అనడానికి దీనిని ఒక ఉదాహరణగా అర్ధం చేసుకోవాలని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే లోకేష్ ని కలిసేందుకు మాట్లాడేందుకు జనసేన ఎమ్మెల్యేలు కూడా ఉత్సాహం చూపడం వైశేషం. ఇక ట్రెజరీ బెంచీలలో అచ్చెన్నాయుడు నారా లోకేష్ ఒక చోట కూర్చున్నారు. ప్రమాణ స్వీకారం జరుగుతున్న తీరుని ఈ ఇద్దరూ పూర్తి స్థాయిలో గమనిస్తూ మధ్యలో మాట్లాడుకుంటూ గడిపారు.
టీడీపీలో అచ్చెన్నాయుడు నారా లోకేష్ ల మధ్య బాండింగ్ ఏమిటి అన్నది కూడా అసెంబ్లీ దృశ్యాలు తెలియచేశాయి. లోకేష్ సైతం ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అయితే జగన్ ప్రమాణం టైంలో మాత్రం ఆయన కూడా ముభావంగానే కనిపించడం విశేషం. ఏది ఏమైనా ఈసారి సభలో కానీ ప్రభుత్వంలో కానీ లోకేష్ పాత్ర ఎలా ఉండబోతోంది అని తెలియచెప్పడానికి ఈ సమావేశాలు ఒక ఫీడ్ బ్యాక్ ఇచ్చాయనే అంటున్నారు.