లోకేష్ టార్గెట్... . ఎందుకలా...!?
ఉండవల్లి కరకట్ట వద్ద లోకేష్ కాన్వాయ్ ని తనిఖీ చేస్తున్న నేపధ్యంలో పోలీసులు ఎన్నికల కోడ్ లో భాగంగానే అని అంటున్నారు.
By: Tupaki Desk | 25 March 2024 1:30 AM GMTనారా లోకేష్ వాహనాలను ఎన్నికల కోడ్ లో భాగంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అది కాస్తా ఆదివారం శృతి మించిందని టీడీపీ నేతలు అంటున్నారు. లోకేష్ కారుని ఆదివారం ఉదయం మధ్యాహ్నం రెండు సార్లు తనిఖీ చేశారు. ఉండవల్లి కరకట్ట వద్ద లోకేష్ కాన్వాయ్ ని తనిఖీ చేస్తున్న నేపధ్యంలో పోలీసులు ఎన్నికల కోడ్ లో భాగంగానే అని అంటున్నారు.
అయితే దీని మీద నారా లోకేష్ మండిపడ్డారు. గత నాలుగు రోజులలో చూస్తే ప్రతీ రోజూ తన వాహనాలను పోలీసులు పని గట్టుకుని టార్గెట్ చేస్తున్నారు అని విమర్శించారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. నా పరువు తీయడానికే ఇలా చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
ఇదంతా పోలీసు ఉన్నతాధికారులు చేయిస్తున్నారు అని ఆయన విమర్శించారు. అదే ఎన్నికల కోడ్ తనకేనా వర్తించేది అని ఆయన నిలదీశారు. వైసీపీ ఎంపీ అయోధ్యా రామిరెడ్డి కారుని ఒక్కసారి అయినా చెక్ చేశారా అని ఆయన నిలదీశారు. ఇదేమీ బాగా లేదని అసలు పద్ధతి కానే కాదని ఆయన అన్నారు.
ఈ విధంగా చేస్తే తాను ఊరుకోనని హెచ్చరించారు. తాను నిరసన తెలియచేయాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. మొత్తం మీద చూస్తే లోకేష్ కారునే ఎందుకు తనిఖీ చేస్తున్నారు, అసలు ఆయన కాన్వాయ్ లో ఏమి ఉందని తనిఖీలు చేస్తున్నారు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నారు
టీడీపీ జాతీయ కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు. అభ్యర్ధుల ఎంపిక ఎన్నికల ప్రచారం వంటివి చంద్రబాబు చూస్తూంటే పార్టీకి కావాల్సిన ఇతర బలాలూ బలగాలూ లోకేష్ చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. యువగళం పాదయాత్ర పూర్తి అయిన తరువాత ఆ మధ్య లోకేష్ కొన్నాళ్ల పాటు మీడియాకు కనిపించలేదు. ఆయన పూర్తిగా హైదరాబాద్ కి పరిమితం అయ్యారు.
పార్టీకి కావాల్సిన వనరులను సమకూర్చే పనిలో లోకేష్ బిగ్ షాట్స్ ని కలుసుకుంటూ కీలకంగా ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. మరో వైపు చూస్తే లోకేష్ ఏకంగా విదేశాలకు వెళ్లారని ఇదే పని మీద ఉన్నారని వార్తలు వచ్చాయి. దాని మీద లోకేష్ మీడియా ముఖంగానే అసహనం వ్యక్తం చేసి వైసీపీ నేతలకు గట్టి రిటార్ట్ ఇచ్చారు.
ఇపుడు కూడా లోకేష్ నే తనిఖీల పేరుతో పోలీసులు చెక్ చేస్తూ పోతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు ఏమిటి అన్నదే టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీలో చంద్రబాబు తరువాత లోకేష్ అగ్ర నాయకుడు. అదే విధంగా చూస్తే టీడీపీ కూటమిలోని ఇతర మిత్రుల విషయంలో ఏమీ చెక్ చేయడం లేదు. ఒక్క లోకేష్ కే ఇలా అవుతోంది, అసలు ఎందుకిలా అన్న చర్చ సాగుతోంది.