Begin typing your search above and press return to search.

గన్నవరంలో గన్ పేల్చనున్న లోకేష్?

ఇదిలా ఉంటే ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో లోకేష్ గన్నవరం మీద గురి పెట్టారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Aug 2023 3:00 AM GMT
గన్నవరంలో గన్ పేల్చనున్న లోకేష్?
X

టీడీపీ యువ నేత నారా లోకేష్ పాదయాత్ర ఈ నెల 19న ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చేరుకుంటుంది. కేవలం మూడు రోజులు మాత్రమే లోకేష్ పాదయాత్ర ఈ జిల్లాలో సాగడం విశేషం. లోకేష్ విజయవాడలో ఎంట్రీ ఇచ్చి ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, పెనమలూరు గన్నవరంలలో పర్యటిస్తారు.

ఇక భారీ బహిరంగ సభ అయితే గన్నవరంలో ఏర్పాటు చేశారు. నిజానికి లోకేష్ క్రిష్ణా జిల్లా పాదయాత్ర అంటే ఒక రేంజిలో సాగుతుంది అని తమ్ముళ్ళు అంచనా వేశారు. ఎందుకంటే ఇక్కడ కొడాలి నాని అనే వైసీపీ ఫైర్ బ్రాండ్ ఉన్నారు. ఆయన నియోజకవర్గం గుడివాడలో లోకేష్ పాదం మోపుతారని అనుకున్నారు.

కానీ ఎందుకో లోకేష్ మూడు రోజులు మాత్రమే పాదయాత్రకు టైం కేటాయించారు. అక్కడ నుంచి ఉభయ గోదావరి జిల్లాలలో లోకేష్ పాదయాత్ర సాగనుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో లోకేష్ గన్నవరం మీద గురి పెట్టారని అంటున్నారు. ఇక్కడ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు.

ఆయన 2014, 2019లలో వరసగా గెలిచారు. అయితే 2019లో టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో వంశీ వైసీపీలోకి జంప్ చేశారు. ఇక వంశీ ఏకంగా చంద్రబాబు మీద ఆయన ఫ్యామిలీ మీద వ్యక్తిగత ఆరోపణలు చాలా చేశారు. దాంతో ఆయన మీద ప్రత్యర్ధి కంటే ఎక్కువగా టార్గెట్ చేయాలన్న కసి అయితే టీడీపీలో ఉంది.

అందుకే లోకేష్ పని గట్టుకుని పాదాన్ని గన్నవరంలో మోపుతున్నారు అని అంటున్నారు. ఈ నెల 21న గన్నవరంలో జరిగే భారీ బహిరంగ సభలో లోకేష్ వంశీ మీద ఏమేమి బాణాలను ఎక్కుపెడతారో అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక ఇదే గన్నవరం నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి తక్కువ తేడాతో ఓడిన యార్లగడ్డ వెంకటర రావు లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్ధం తీసుకుంటారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే వంశీతో పాటు కొడాలి నానికి ఇదే విధంగా వైసీపీ నేతలకు లోకేష్ గట్టి పంచులే పేలుస్తారని, సీరియస్ కామెంట్స్ ఎన్నో చేస్తారని అంటున్నారు. దాంతో ఈ నెల 21న లోకేష్ గన్నవరం మీటింగ్ మీద ఇపుడు అందరి దృష్టి పడింది. మరో వైపు చూస్తే ఉన్నది టీడీపీలో అయినా జనసేన్ వైపు చూపు చూస్తున్న వంగవీటి రాధా లోకేష్ పాదయాత్రలో ఆయనతో కలసి అడుగులు వేస్తారా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం.

ఆయన కోరుకుంటున్న విజయవాడ సెంట్రల్ లో కూడా లోకేష్ పాదయాత్ర ఉంది. మరి అక్కడ ఏమైనా ఆయన మాట్లాడుతారా ఆయనను రాధా పర్సనల్ గా మీట్ అయి విజయవాడ సెంట్రల్ సీటు విషయం తేల్చమంటారా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఈ నెలాఖరులో రాధా తన డెసిషన్ ప్రకటిస్తారు అని తెలుస్తున్న క్రమంలో లోకేష్ పాదయాత్రలో ఇది కూడా కీలకం కానుంది అని అంటున్నారు.