Begin typing your search above and press return to search.

లోకేష్ ట్వీట్ బాధ అనిపించింది.. మమ్మల్ని అందులోకి లాగొద్దు!

దీంతో శుక్రవారం మొత్తం ఆ వ్యవహారం బాబు అరోగ్యంపై అనుమానాలంటూ టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు.

By:  Tupaki Desk   |   14 Oct 2023 5:12 AM GMT
లోకేష్  ట్వీట్ బాధ అనిపించింది.. మమ్మల్ని అందులోకి లాగొద్దు!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు అస్వస్థతగా ఉందనే విషయంపై గురువారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు రియాక్టైన సంగతి తెలిసిందే. దీంతో హుటాహుటిన రాజమండ్రి జీజీహెచ్ నుంచి స్పెషలిస్ట్ లను రప్పించి వైద్యం అందించారు. తర్వాత అది స్కిన్ అలర్జీ అని, మందులూ, క్రీములూ ఇచ్చారని తెలిసింది.

దీంతో శుక్రవారం మొత్తం ఆ వ్యవహారం బాబు అరోగ్యంపై అనుమానాలంటూ టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో... అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్లుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో లోకేష్ ఒక ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... చంద్రబాబుకు స్టెరాయిడ్ లు ఇద్దామని చూస్తున్నారని... ఆయన ఆరోగ్యంపై జైలు అధికారులు, వైద్యులు ఏదో దాస్తున్నారని ట్వీట్ చేశారు.

దీంతో... ఈ ట్వీట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ విషయంపై స్పందించిన ఆయన... లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించిందని.. చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలనని.. లోకేష్ చెప్పింది వాస్తవం అయితే ఈ పరిస్థితి బాధాకరమని.. అన్నారు.

ఇదే సమయంలో... తనకు ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల నిజానిజాలు తెలియవని చెప్పిన కేటీఆర్.. ఆయన భద్రతకు ప్రమాదం అయితే మాత్రం అది రాజకీయాల్లో దురదృష్టకరం అని అన్నారు. ఇదే సమయంలో లోకేష్ పరిస్ధితిని తాను అర్ధం చేసుకోగలనని, రాజకీయాలు వేరైనా ఆయన కుటుంబం బాధను తాను అర్ధం చేసుకోగలనని కేటీఆర్ తెలిపారు.

ఈ సమయంలో... నిమ్స్ ఆసుపత్రిలో కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో ఆయన ఆరోగ్యంపై కూడా తాము చాలా ఆందోళన చెందామని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ టైంలో ... కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం పొంచి ఉందని ఇంటలిజెన్స్ అధికారులు తీవ్ర స్థాయిలో హెచ్చరించారని అన్నారు.

అందువల్ల... ఇలాంటి సమయాల్లో ఎలాంటి మానసిక పరిస్థితి ఉంటుందో తాను అర్ధం చేసుకోగలనని తెలిపారు కేటీఆర్. ఇక, హైదరాబాద్ శాంత భద్రతలకు విఘాతం కలగవద్దన్న నేపథ్యంలోనే ఇక్కడ అందోళన చేయవద్దు అని చెప్పినట్లు తెలిపిన ఆయన... చంద్రబాబు అరెస్ట్ వి షయం ఏపీలోని రెండు పార్టీల మధ్య వ్యవహారం అని, తమని అందులోకి లాగవద్దని స్పష్టం చేశారు.

మరోపక్క చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... "భ‌ద్రత‌లేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయ‌న‌కి ప్రాణ‌హాని తల‌పెడుతున్నారు. ఎన్నడూ ఏ త‌ప్పూ చేయ‌ని 73 ఏళ్ల చంద్రబాబు ప‌ట్ల రాక్షసంగా వ్యవ‌హ‌రిస్తోంది ఈ ప్రభుత్వం. వ్యవ‌స్థల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియ‌ల్ రిమాండ్‌ లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్రబాబు గారిని అనారోగ్య కార‌ణాల‌తో అంత‌మొందించే ప్రణాళిక ఏదో ర‌చిస్తున్నారు" అని అన్నారు.

ఇదే సమయంలో... "చంద్రబాబు గారి ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉంది. జ్యుడీషియ‌ల్ రిమాండ్‌ లో ఉన్న చంద్రబాబు గారిని ముద్దాయి అని హెల్త్ బులెటిన్లో ప‌దే ప‌దే పేర్కొనేందుకు పెట్టిన శ్రద్ధ ఆయ‌న ఆరోగ్యం, భ‌ద్రత‌పై పెట్టడంలేదు. చంద్రబాబు గారికి ఏ హాని జ‌రిగినా, సైకో జ‌గ‌న్ స‌ర్కారు, జైలు అధికారుల‌దే బాధ్యత‌" అని లోకేష్ ట్వీట్ చేశారు.