టఫ్ ఫైట్ గురూ : మంగళగిరిలో లోకేష్ వర్సెస్ వైసీపీ....!
బీసీ నేత అయిన గంజి చిరంజీవిని మంగళగిరి వైసీపీ అభ్యర్ధిగా నిలబెడుతోంది.
By: Tupaki Desk | 25 Jan 2024 2:01 PM GMTవైసీపీ మరోసారి టీడీపీ చినబాబు నారా లోకేష్ ని ఓడించాలని చూస్తోంది. ఎందుకంటే లోకేష్ ని ఓడిస్తే టీడీపీ ఖేల్ ఖతం అవుతుంది అన్నది వైసీపీ వ్యూహం. దాంతోనే లోకేష్ ని ఓడించేందుకు సామాజిక సమీకరణలను కూడా చూసుకుంది. బీసీ నేత అయిన గంజి చిరంజీవిని మంగళగిరి వైసీపీ అభ్యర్ధిగా నిలబెడుతోంది.
ఈ విషయంలో తమకు అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డిని సైతం పక్కన పెట్టేసింది వైసీపీ. దాంతో మంగళగిరి మీద ఎంతగా వైసీపీ గురి పెట్టిందో అర్ధం చేసుకోవాల్సి ఉంది. మంగళగిరి నియోజకవర్గం చూస్తే కనుక ఏకంగా రెండు లక్షల ఎనభై వేల పై చిలుకు ఓటర్లు ఉన్న పెద్ద నియోజకవర్గం.
పైగా ఇందులో అత్యధిక శాతం ఓట్లు బీసీలవే కావడం కూడా విశేషం. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గంజి చిరంజీవి పోటీ చేసి కేవలం 12 ఓట్ల తేడాతోనే ఓటమి పాలు అయ్యారు. ఆయన 2019 ఎన్నికల్లో లోకేష్ కి సహాయంగా ఉంటూ ఆయన గెలుపు కోసం కృషి చేశారు.
ఎందుకంటే 2024లో తనకు ఆ సీటు టీడీపీ ఇస్తుందని భావించారని చెబుతారు. ఎపుడైతే లోకేష్ 2024లోనూ అదే సీటు నుంచి తానే పోటీ చేస్తాను అని చెప్పారో ఆనాటి నుంచి చిరంజీవి అసంతృప్తికి లోను అయ్యారు. అది కాస్తా వైసీపీ వైపు ఆయన్ని నడిపించింది. దాంతో పాటు వైసీపీ కూడా ఆయనను ఆదరించి నామినేటెడ్ పదవి ఇచ్చింది. 2024లో ఆయనకే ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తోంది.
దాంతో చిరంజీవి పదేళ్ల తరువాత ఎమ్మెల్యేగా అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. పైగా టీడీపీ తరఫున పోటీకి దిగుతున్న లోకేష్ ఆయనకు ప్రత్యర్ధిగా ఉన్నారు. ఇక బీసీ వర్గంలో మంచి పట్టు ఉండి ఎమ్మెల్యేగా కూడా గతంలో గెలిచిన మురుగుడు హనుమంతరావు వైసీపీలోనే ఉన్నారు.
మరో వైపు టీడీపీకి జనసేన మద్దతుగా ఉంది. అలాగే వామపక్షాలు కూడా జట్టు కడితే కూటమి బలం పెరుగుతుంది. ఇంకో వైపు కాంగ్రెస్ నుంచి ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి మళ్ళీ పోటీకి దిగబోతున్నారు. దాంతో ఎవరి ఓట్లు ఎవరు చీలుస్తారు అన్నది పెద్ద చర్చగా ఉంది. దాంతో పాటుగానే వైసీపీ బీసీలను నమ్ముకుంటే టీడీపీ జనసేనతో వచ్చే ఓట్లను నమ్ముకుంది.
దాంతో మంగళగిరిలో హోరాహోరీ పోటీ జరగడం ఖాయం అని అంటున్నారు. ఇక్కడ ఇంకో విశేషం కూడా మంగళగిరిలో ఎపుడూ పెద్దగా మెజారిటీలు వచ్చిన దాఖలాలు లేవు. 2014లో 12 ఓట్లతో కూడా గెలుపుని చూసిన సీటు ఇది. అంటే చివరి ఓటు కూడా గెలుపు పిలుపు వినిపిస్తుంది అన్న మాట. సో మంగళగిరి ఏపీలో హాటెస్ట్ సీటు గా 2024 ఎన్నికల్లో ఉండబోతోంది అన్నది నిజం.