లోకేశ్ ను ఇన్ని మాటలు అంటూ లాజిక్ మిస్ అయ్యారేంటి అంబటి?
మర్యాదల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా మారిన తాజా రాజకీయ పరిస్థితులకు తగ్గట్లుగా టీడీపీ ముఖ్యనేత లోకేశ్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు మంత్రి అంబటి రాంబాబు.
By: Tupaki Desk | 20 Dec 2023 6:30 AM GMTవెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేయటం ఇప్పటి రాజకీయాల్లో చెల్లుబాటు అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఘాటుగా మాట్లాడితే అంత సంచలనం.. అంత మైలేజీ. మర్యాదల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా మారిన తాజా రాజకీయ పరిస్థితులకు తగ్గట్లుగా టీడీపీ ముఖ్యనేత లోకేశ్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. లోకేశ్ పాదయాత్ర ముగింపు నేపథ్యంలో బుధవారం విశాఖపట్నంలో పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. లోకేశ్ పాదయాత్రతో ఎవరికైనా ప్రయోజనం ఉందా? అంటూ ఎద్దేవా చేశారు.
అక్కడితో ఆగని ఆయన.. లోకేశ్ పై మరింత ఘాటుగా మాట్లాడారు. ఈ సందర్భంగా అంబటి నోటి నుంచి వచ్చిన మాటల్ని ఆయన మాటల్లోనే చెబితేనే ఆ ఎఫెక్టు వేరుగా ఉంటుంది. లోకేశ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అంబటి వ్యాఖ్యల్లో హైలెట్ లాంటి వ్యాఖ్యల్ని చూస్తే.
- లోకేశ్ కుప్పంలో అడుగు వేయగానే తారకరత్న మరణించారు. లోకేశ్ ది అశుభయాత్ర. పాదం పెట్టగానే నందమూరి వంశస్తుడు చనిపోయాడు.
- జనం లేక వెలవెలబోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. యాత్ర వల్ల ఒళ్లు తగ్గిందే తప్పించి.. మైండు మెచ్యూరిటీ లేదు.
- ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా తెల్లగ మారదనే వేమన శతకం మాదిరి లోకేశ్ యాత్ర సాగింది. ఎల్లో మీడియా అయితే విపరీతంగా జనం వచ్చారని చెప్పటానికి తెగ ప్రయత్నం చేసింది.
- చివరకు ఉదయభానును తెచ్చి మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. మూడు 15వేలు.. 90వేలు అని చెప్పిన అజ్ఞాని లోకేశ్. రేపు బాలక్రిష్న యాంకరింగ్ చేయబోతున్నారు. ఇంకో యాంకర్ పవన్ కల్యాణ్ కూడా రేపు యాంకరింగ్ చేయబోతున్నారు. వ్రద్ధ తండ్రి తన అసమర్థుడైన కొడుకును హైలెట్ చేయటానికి చేస్తున్న ప్రయత్నమే కనిపిస్తోంది.
- లోకేశ్ యాత్ర అంత విజయవంతమైతే.. బాలక్రిష్ణ.. పవన్ కల్యాణ్ ల యాంకరింగ్ ఎందుకు? సీట్లు.. నోట్లు మాట్లాడుకొని పవన్ కల్యాణ్ తోయాంకరింగ్ ఒప్పించుకున్నాడు.
- కిరాయి తీసుకొని పవన్ లోకేశ్ సభకు వస్తున్నాడు. స్పెషల్ ఫ్లైట్లు.. స్పెషల్ రైళ్లలో రేపు జనాన్ని తరలిస్తున్నారు. స్కాంలో సంపాదించిన సొమ్ము రేపు ఖర్చు చేస్తున్నారు. ప్రజల్లో గెలవకుండా మంత్రి అయిన వ్యక్తి లోకేశ్. అలాంటి వారికి ప్రజల కష్టాలేం తెలుసు?
ఇలా లోకేశ్ ను అన్ని కోణాల్లో ఉతికి ఆరేసిన అంబటి.. మొత్తంగా చూసినప్పుడు అసలు పాయింట్ ఒకటి మిస్ అయినట్లుగా కనిపించకమానదు. నిజంగానే లోకేశ్ పాదయాత్ర అట్టర్ ప్లాప్ అయితే.. జనాల స్పందన లేనిపక్షంలో ఇలా ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు మరీ మంత్రి స్థానంలో ఉన్న అంబటి అంతలా ఆయాసపడాల్సిన అవసరం ఏముంది? అన్నది ప్రశ్నగా మారింది. ఈ చిన్న లాజిక్ మిస్ అయి.. అన్నేసి మాటలు అనటం చూస్తేనే.. లోకేవ్ పాదయాత్ర ముగింపునకు తాను ఎంత ప్రాధాన్యత ఇస్తుందన్నది ఇట్టే అర్థమవుతుందని చెబుతున్నారు.