లోకేష్ వాట్సప్ ని బ్లాక్ చేసిన మెటా... ప్రత్యామ్నాయమిదే!
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం.. నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం తెలిసిందే
By: Tupaki Desk | 11 July 2024 11:25 AM GMTఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం.. నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో... కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికంటే ఎక్కువగా అన్నట్లుగా లోకేష్ బిజీగా ఉంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా అటు కార్యకర్తలతోనూ, ఇటు సమస్యల కోసం వినతులు చేసే ప్రజలతోనూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. పైగా ప్రజలు తమ సమస్యలను వాట్సప్ ద్వారా లోకేష్ కు చెప్పుకునే అవకాశం ఉండటంతో ఆ వ్యవహారంతో మరింత బిజీ అయిపోయారని చెబుతున్నారు. ఈ సమయంలో వాట్సప్ మాతృసంస్థ ‘మెటా’ లోకేష్ వాట్సప్ ను బ్లాక్ చేసింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... ప్రజలు తమ తమ సమస్యలను వాట్సప్ ద్వారా లోకేష్ కు చెప్పుకునే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలపై వాట్సాప్ మెసేజ్ లు పంపుతున్నారు. దీంతో మంత్రి లోకేష్ వాట్సప్ ను ‘మెటా’ బ్లాక్ చేసింది. వేలాది మంది వాట్సప్ చేయడం వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో బ్లాక్ అయినట్లు లోకేష్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈ సమయంలో ప్రత్యామ్నాయాన్ని వెంటనే ఏర్పాటు చేశారు. ప్రజలు తమ సమస్యలను ఇకపై వాట్సప్ ద్వారా కాకుండా మెయిల్ ద్వారా పంపాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా... హలో.లోకేష్@ఏపీ.జీవోవీ.ఇన్ (hello.lokesh@ap.gov.in) మెయిల్ ఐడీ ద్వారా ప్రజలు తనకు సమస్యలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. తానే స్వయంగా అందరి సమస్యలూ చూస్తానని స్పష్టం చేశారు.
అయితే తమ తమ సమస్యలు, సమాచారాన్ని లోకేష్ కు మెయిల్ ద్వారా పంపేవారు... వినతులతో పాటు పేరు, ఊరుతో పాటు మొబైల్ నెంబర్ ను పొందుపరుచాలని సూచించారు.