తెలంగాణలో కాంగ్రెస్ దే గెలుపు.. తేల్చిన ప్రముఖ సర్వే!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది
By: Tupaki Desk | 6 Oct 2023 7:16 AM GMTతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత నవంబర్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్, డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే వీలు ఉంది. దాదాపు ఇదే షెడ్యూల్ ఖరారవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణలో పర్యటించారు. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర అధికారులతో వారు సమీక్ష జరిపారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ సంస్థలు తమ సర్వేలను వెల్లడిస్తున్నాయి. తాజాగా లోక్ పోల్ అనే సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. మరోమారు తమదే అధికారమని చెబుతున్న బీఆర్‌ఎస్ కు లోక్ పోల్ సర్వే షాక్ ఇచ్చింది. బీఆర్‌ఎస్ ఈసారి అధికారంలోకి రావడం లేదని తేలిపోయింది.
అలాగే తెలంగాణలో బీఆర్‌ఎస్ ఓడిపోతే అధికారం తమదే అని గట్టి లెక్కలు వేసుకున్న బీజేపీ పరిస్థితి మరీ తీసికట్టుగా మారుతుందని సర్వే తెలిపింది. ఆ పార్టీకి కేవలం 2–3 సీట్లు మాత్రమే దక్కుతాయని సర్వే బాంబుపేల్చింది. మొత్తం మీద బీజేపీకి 10 నుంచి 12 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వే స్పష్టం చేసింది.
ఇక అధికార బీఆర్‌ఎస్ కు 45–51 మధ్య సీట్లు వస్తాయని లోక్ పోల్ సర్వే వెల్లడించింది. బీఆర్‌ఎస్ కు 39 శాతం నుంచి 42 శాతం వరకు ఓట్లు లభిస్తాయని పేర్కొంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ నిలుస్తుందని లోక్ పోల్ సర్వే తెలిపింది.
ఇక ఎంఐఎం పార్టీ 6–8 సీట్లకే పరిమితమవుతుందని సర్వే వెల్లడించింది. ఎంఐఎంకు 3-4 శాతం ఓట్లు మాత్రమే దక్కుతాయని పేర్కొంది.
ఇక కాంగ్రెస్ పార్టీ ఈసారి తెలంగాణలో అధికారాన్ని చేపడుతుందని లోక్ పోల్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ కు 61–67 సీట్లు దక్కుతాయని సర్వే తెలిపింది. 41–44 శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని వివరించింది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు పథకాలపై ప్రజల్లో చర్చ జరుగుతోందని.. ఈ పథకాల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని లోక్ పోల్ తేల్చింది.
ఈ నేపథ్యంలో లోక్ పోల్ సర్వే హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని లోక్ పోల్ వేసిన అంచనా నిజమైంది. ఆ సర్వే చెప్పినట్టే కాంగ్రెస్ కర్ణాటకలో అధికారం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని లోక్ పోల్ పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దీంతో కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. కర్ణాటకలో లోక్ పోల్ సర్వే విజయవంతమైంది కాబట్టి ఇక్కడ సైతం అదే జరుగుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా 3–5 శాతం ఓట్లు ఇతరులకు వస్తాయని వెల్లడైంది. ఇతరులు ఒక్క సీటులో గెలిచే అవకాశాలున్నాయని లోక్ పోల్ సర్వే పేర్కొంది.