Begin typing your search above and press return to search.

ఎంపీ సీట్లు 543 నుంచి 848...నార్త్ దే ఆధిపత్యం...సౌత్ కి భారీ నష్టం ?

మరో రెండేళ్లలో లోక్ సభలో ఉన్న 543 ఎంపీ సీట్లు 543 ముంచి 848 దాకా పెరుగుతాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Oct 2024 7:30 AM GMT
ఎంపీ సీట్లు 543 నుంచి 848...నార్త్ దే ఆధిపత్యం...సౌత్ కి భారీ నష్టం ?
X

మరో రెండేళ్లలో లోక్ సభలో ఉన్న 543 ఎంపీ సీట్లు 543 ముంచి 848 దాకా పెరుగుతాయని అంటున్నారు. కొత్త నియోజకవర్గాలు పుట్టుకుని వస్తాయన్నమాట. అలా కనుక జరిగితే జనాభా ప్రాతిపదికన ఈ సీట్ల విభజన ఉంటుంది. అంటే జనాభా ఎక్కువ ఎక్కడ ఎక్కువ ఉంటే వారికి ఎక్కువ సీట్లు వస్తాయి. తక్కువ ఉన్న చోట తక్కువే.

ఈ పరిణామంతో ఉత్తరాది రాష్ట్రాలకు భారీ లాభం కలుగుతుందని అంటున్నారు. అంతే కాదు 2026 తరువాత లోక్ సభ సీట్లు పెరిగితే కేంద్రంలో రాజకీయ ఆధిపత్యం పూర్తిగా ఉత్తరాది వారి చేతుల్లోకి పోతుంది అని అంటున్నారు. జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు ఈ శిక్షనా అన్న చర్చ ఇపుడు బయల్దేరింది.

మంచికి పోతే చెడునా అని అంటున్నారు. ఈ దేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి వాటికే ఎక్కువ లాభం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం 80 ఎంపీ సీట్లతో యూపీ రాజుగా ఉంది. ఆ సంఖ్య కాస్తా 143కి పెరుతుంది అని అంటున్నారు. అలాగే బీహార్ కి 40 ఎంపీ సీట్లు ఉంటే అది 79 అవుతుంది అని అంటున్నారు.

అలాగే ఇతర ఉత్తరాది రాష్ట్రాలు కూడా లబ్ది పొందుతాయి. అదే సౌత్ ఇండియాలో చూసుకుంటే ప్రస్తుతం ఉన్న 129 ఎంపీ సీట్ల నుంచి 165కి పెరుగుతాయి అని అంటున్నారు. అంటే చాలా స్వల్పంగా అన్న మాట. తెలంగాణాలో ప్రస్తుతం 17 ఉంటే అవి 23కి, ఏపీలో 25 నుంచి 31కి అంటే జస్ట్ ఆరు సీట్లు మాత్రమే పెరుగుతాయన్న మాట. అలాగే కర్ణాటకలో 28 నుంచి 41కి, తమిళనాడులో 39 నుంచి 49కి పెరుగుతాయని అంటున్నారు. కేరళలో 20 సీట్లలో పెద్దగా పెరగవు అని అంటున్నారు.

ఇక ఈ దేశంలో 1972లో జనాభా ప్రాతిపదికన లోక్ సభ సీట్ల పునర్వ్యవస్థీకరణ జరిగింది. మళ్ళీ 2026లో జనాభా ప్రాతిపదికగానే లోక్ సభ సీట్ల పునర్ వ్యవస్థీకరణ చేపడతారు. అదే కనుక జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఎంతో నష్టం జరుగుతుంది.

దాంతో జనాభా ప్రాతిపదికన అన్న కొలమానం వద్దని దక్షిణాది రాష్ట్రాలు కోరుతున్నాయి. మరో వైపు ఏపీ సీఎం చంద్రబాబు అయితే ఎక్కువ మంది పిల్లలను కనాలని కోరుతున్నది కూడా ఇందుకోసమే అని అంటున్నారు. ఆయన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ ఆలోచన చేస్తున్నారు. జపాన్ చైనా సహా చాలా దేశాలు జనాభా కొరత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ పరిస్థితి ఏపీకి రావద్దు అని ఆయన అంటున్నారు.

మరో వైపు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా నవ దంపతులు కనీసంగా పదహారు మంది పిల్లలను కనాల ని పిలుపు ఇస్తున్నారు. ఈ విధంగా సంతానమే సౌభాగ్యం అన్న సీఎం ల నినాదం వెనక లోక్ సభ సీట్లు కూడా ఉన్నాయని అంటున్నారు. నిజానికి జనాభా నియంత్రణ అన్నది ఆహార కొరతను దృష్టిలో ఉంచుకుని కొన్ని దశాబ్దాల క్రితం చేసినది అని అంటున్నారు.

ఇపుడు సంతానోత్పత్తి బాగా తగ్గిందని మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో బాగా వెనకబడి ఉంటే ఉత్తరాది రాష్ట్రాలు ముందుకు సాగుతున్నాయని ఫలితంగా దేశంలో అన్ని రకాల వాటాలు వారికే పోతునాయన్న చర్చ మేధావి వర్గంలో ఉంది. ఏది ఏమైనా ఎక్కువ మంది పిల్లలను కనాలి అని ఇద్దరు సీఎంలు ఏకకాలంలో పిలుపు ఇచ్చారు. ఇది ఉద్యమంగా మారుతుందా అన్నది చూడాల్సి ఉంది.