Begin typing your search above and press return to search.

కేసీఆర్ సభకు కండిషన్స్... దూషణలు చేయరాదు.. బాణసంచా కాల్చరాదు!

అవును... కే.ఆర్‌.ఎం.బీ.కి కృష్ణానది ప్రాజెక్టులు అప్పగింతను నిరసిస్తూ బీఆరెస్స్ తలపెట్టిన చలో నల్లగొండ సభకు ఏర్పాట్లు షురూ అయ్యాయి

By:  Tupaki Desk   |   10 Feb 2024 3:43 AM GMT
కేసీఆర్ సభకు కండిషన్స్... దూషణలు చేయరాదు.. బాణసంచా కాల్చరాదు!
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నడు వినని విషయాలు, చదవని వార్తలు చదువుతున్నట్లున్నారు బీఆరెస్స్ నేతలు అనే కామెంట్లు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో వినిపిస్తున్నాయి. బీఆరెస్స్ సభలకు అనుమతుల కోసం ఎదురు చూడటం.. ఆ సభల్లో చేసే ప్రసంగాలు ఎలా ఉండాలనే విషయంలో పోలీసుల నుంచి ఆంక్షలు వినిపించడం... ఇప్పుడు ఇవన్నీ బీఆరెస్స్ నేతలకు, అధినేతకూ కొత్తగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ కారణం అయ్యింది నల్గొండలోని బీఆరెస్స్ నిర్వహించబోయే సభ!

అవును... కే.ఆర్‌.ఎం.బీ.కి కృష్ణానది ప్రాజెక్టులు అప్పగింతను నిరసిస్తూ బీఆరెస్స్ తలపెట్టిన చలో నల్లగొండ సభకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. అయితే ఈ సభకు పోలీసుల నుంచి అనుమతుల విషయంలో నిన్నటివరకూ సందిగ్దత నెలకొంది. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ పాల్గొనబోతున్న మొట్టమొదటి బహిరంగ సభ ఇది కానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తీవ్ర రసవత్తరంగా ప్రసంగాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే... ఈ సభను అడ్డుకుంటామంటూ కాంగ్రెస్ నేతల నుంచి ప్రకటనలు వస్తుండంటో పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యిందని తెలుస్తుంది. ఈ విషయాలపై స్పందించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి... తాము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సభలను ఏనాడూ అడ్డుకోలేదని చెబుతున్నారు. ఆ సంగతులు అలా ఉంటే... మరోపక్క జిల్లా వ్యాప్తంగా 31, 31ఏ పోలీస్ చట్టం అమలులో ఉంటుందని.. ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలూ జరపకూడదని పోలీసులు తెలిపారు.

దీంతో ఈ సభ జరుగుతుందా.. లేదా అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో పోలీసులు ఈ బీఆరెస్స్ సభకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు! ఈ సందర్భంగా విధించిన షరతులు ఆసక్తికరంగా మారాయి. అవును... నల్గొండలోని మర్రిగూడ బైపాస్ లో ఈ నెల 13న భారీ ఎత్తున నిర్వహించ తలపెట్టిన బీఆరెస్స్ సభకు పోలీసులు కొన్ని షరతులు విధించారు. ఇప్పుడు ఈ కండిషన్స్ ఆసక్తిగా మారాయి.

ఇందులో భాగంగా... కేసీఆర్ హాజరయ్యే ఈ సభలో వ్యక్తిగత దూషణలు చేయరాదని.. కులం, మతం ప్రాతిపదికన ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని.. ఇతరులను కించపరిచేలా, రెచ్చగొట్టేలా మాట్లాడకూడదని పోలీసులు సూచించారు. ఇదే సమయంలో... సభలో ఎటువంటి బాణసంచా కాల్చరాదని, రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించరాదని ఆదేశించారు. వీటిని అతిక్రమిస్తే సభ అనుమతి రద్దు చేస్తామని స్పష్టం చేశారని తెలుస్తుంది!

దీంతో... ఇవేమీ లేకుండా కేసీఆర్ పాల్గొంటున్న, ఆయన ప్రసంగించనున్న బీఆరెస్స్ సభ ఎలా జరగబోతుంది అనే విషయంపై తీవ్ర ఆసక్తినెలకొంది!