లోక్ సభ ఎన్నికల్లో 9, 10, 11 సార్లు గెలిచిందెవరో తెలుసా?
అయితే ఇప్పటివరకూ దేశంలో ఎక్కువసార్లు ఎంపీలుగా ఎన్నికైనవారెవరనే విషయం ఇప్పుడు చూద్దాం
By: Tupaki Desk | 22 May 2024 8:29 AM GMTదేశవ్యాప్తంగా 2024 లోక్ సభ ఎన్నికల సందడి ప్రస్తుతం దేశంలో నెలకొంది. ఈ క్రమంలో పలువురు సీనియర్లు, కొంతమంది జూనియర్లు, ఇంకొంతమంది ఫ్రెషర్లూ తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సీనియర్స్ లో కొందరు ఐదోసారి, మరికొందరు ఏడోసారి ఎంపీల రేసులో ఉన్నారు. అయితే ఇప్పటివరకూ దేశంలో ఎక్కువసార్లు ఎంపీలుగా ఎన్నికైనవారెవరనే విషయం ఇప్పుడు చూద్దాం...!
అవును... స్వంతంత్ర భారతదేశంలో తొలిసారిగా 1952లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. అంటే... నాటి నుంచి నేటి వరకూ 17 సార్లు లోక్ సభ ఎన్నికలు జరిగాయన్నమాట. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్నవి 18వ లోక్ సభకు ఎన్నికలు. ఈ క్రమంలో... ఇప్పటివరకూ స్వతంత్ర భారతదేశంలో అత్యధిక సార్లు ఎంపీలుగా గెలిచింది ఎవరనే సంగతి ఇప్పుడు చూద్దాం...!
ఇంద్రజీత్ గుప్తా:
స్వతంత్ర భారత దేశంలో అత్యధిక సార్లు లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తిగా కమ్యూనిస్టు నేత ఇంద్రజిత్ గుప్తా రికార్డు సృష్టించారు. ఈయన 1960లో తొలిసారిగా లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన చివరిసారిగా 1999లో గెలిచారు. ఈ క్రమంలో 11 సార్లు ఆయన లోక్ సభ ఎన్నికల్లో గెలిచారు.
సోమనాథ్ ఛటర్జీ:
ఇప్పటివరకూ భారతదేశంలో అత్యధిక సార్లు ఎంపీగా గెలిచిన జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఇంద్రజిత్ గుప్తా ఉండగా... నెస్ట్ ప్లేస్ లో సోమనాథ్ ఛటర్జీ ఉన్నారు. ఈయన తన జీవితకాలంలో 10 సార్లు లోక్ సభకు ఎన్న్నికయ్యారు. ఇదే క్రమంలో ఆయనకు 1996లో "అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు" లభించింది.
పీఎం సయీద్:
సోమనాథ్ చటర్జీ అనంతరం పీఎం సయీద్ కూడా 10సార్లు ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. 1967 నుండి 1999 వరకు వరుసగా 10 సార్లు లోక్ సభకు ఎంపికైన ఆయన... తొలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో లో చేరారు.
అటల్ బిహారీ వాజ్ పేయి:
ఆ విధంగా పైన చెప్పుకున్న ముగ్గురూ 10కంటే ఎక్కువసార్లు లోక్ సభకు ఎన్నికవ్వగా... ఆ తర్వాత స్థానంలో వాజ్ పేయి ఉన్నారు. మూడుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్ పేయి.. తొమ్మిది సార్లు లోక్ సభ ఎన్నికల్లో గెలిచారు. ఈ క్రమంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు.
ఇదే క్రమంలో... మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ లోక్ సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు చింద్వారా స్థానం నుంచి గెలిచారు.
అదేవిధంగా... 1971లో తొలిసారిగా లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన దివంగత నేత మాధవ్ రావ్ సింధియా... గ్వాలియర్ లోక్ సభ స్థానం నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా గెలిచారు.
ఒడిశాలోని నబరంగ్ పూర్ లోక్ సభ స్థానం నుంచి వరుసగా తొమ్మిది సార్లు లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు కాంగ్రెస్ దివంగత నేత ఖగపతి ప్రదాని.
ఇదే క్రమంలో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమాంగ్ సైతం లోక్ సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు విజయం సాధించారు. కోరాపుట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
ఇక బీహార్ లోని హాజీపూర్ లోక్ సభ స్థానం నుంచి ఎనిమిది సార్లు, రోస్రా లోక్ సభ స్థానం నుంచి ఒకసారి గెలుపొంది 9సార్లు ఎంపీగా ఎన్నికైన నేతగా రామ్ విలాస్ పాశ్వాన్ రికార్డ్ సృష్టించారు.
వీరితోపాటు లోక్ సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు గెలిచిన నేతల్లో జార్జ్ ఫెర్నాండెజ్ కూడా ఉన్నారు. 1967లో తొలిసారిగా ముంబై సౌత్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన ఆయన... బీహార్ లోని ముజఫర్ పూర్ స్థానం నుంచి ఐదుసార్లు, నలంద నుంచి మూడుసార్లు గెలిచారు.
ఇదే క్రమంలో... పశ్చిమ బెంగాల్ లోని బంకురా లోక్ సభ స్థానం నుంచి సీపీఐ(ఎం) నేత వాసుదేబ్ ఆచార్య తొమ్మిది సార్లు ఎంపీగా గెలుపొందగా... మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత మాణిక్ రావ్ హోడల్యా కూడా తొమ్మిదిసార్లు ఎంపీగా విజయం సాధించారు.