Begin typing your search above and press return to search.

మోడీ-కంగ‌న-మాజీ సీఎం స‌హా అగ్ర‌నేత‌ల ఫ్యూచ‌ర్ తేలేది రేపే!

అయితే..యోగి ఆదిత్య‌నాథ్ సూచ‌న‌ల‌తో ఆయ‌న వార‌ణాసిని ఎంచుకున్నారు(యూపీ). అప్ప‌టి నుంచి వ‌రుస‌గా రెండు సార్లు గెలిచారు

By:  Tupaki Desk   |   31 May 2024 8:25 AM GMT
మోడీ-కంగ‌న-మాజీ సీఎం స‌హా అగ్ర‌నేత‌ల ఫ్యూచ‌ర్ తేలేది రేపే!
X

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌హా.. బాలీవుడ్ న‌టి, ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ వంటి అగ్ర‌నేత‌ల భ‌విత‌వ్యం తేల్చే తుది ద‌శ ఎన్నిక‌ల పోరాటం శ‌నివారం జ‌ర‌గ‌నుంది. ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గం నుంచి వరుసగా 3వ సారి బ‌రిలో నిలిచారు. 2014లో తొలిసారి ఆయ‌నకు బీజేపీ గాంధీన‌గ‌ర్‌(గుజ‌రాత్‌) నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆఫ‌ర్ చేసింది. అయితే..యోగి ఆదిత్య‌నాథ్ సూచ‌న‌ల‌తో ఆయ‌న వార‌ణాసిని ఎంచుకున్నారు(యూపీ). అప్ప‌టి నుంచి వ‌రుస‌గా రెండు సార్లు గెలిచారు.

ఇక‌, హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా బాలీవుడ్‌ నటి, ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్, హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పశ్చిమబెంగాల్ లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి తృణముల్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్నారు. బీహార్ లోని పాటలీ పుత్ర నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతీ పోటీలో ఉన్నారు.

అలాగే బీహార్ లోని పాట్నా నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. పంజాబ్ లోని జలంధర్ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ జిత్ సింగ్ చన్ని బరిలో ఉన్నారు. శ‌నివారంతో 18వ పార్ల‌మెంటుకు సంబంధించిన మొత్తం ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ పూర్తికానుంది. శనివారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే పోలింగ్ ప్ర‌క్రియ సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు జరుగనుంది.

తుది దశలో మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 57 లోక్ సభ స్థానాల్లో ఓట‌ర్లు త‌మ హ‌క్కును వినియోగించుకోనున్నారు. తుది దశ పోలింగ్ జరగనున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఒడిషా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, చత్తిస్ ఘడ్ లు ఉన్నాయి. 57 స్థానాలకు వివిధ పార్టీల‌కు చెందిన‌ మొత్తం 904 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. స‌మ‌స్యాత్మ‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేక బ‌ల‌గాల‌తో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేసింది.