Begin typing your search above and press return to search.

రెండు జాతీయ సర్వేలు...మరీ ఇంత తేడానా ..?

తాజాగా చూస్తే రెండు జాతీయ సంస్థల సర్వేలు వచ్చాయి. ఆ రెండు సర్వేలు కూడా చాలా వ్యత్యాసంతో ఉండడంతో ఏపీ రాజకీయాల మీద అయోమయం కలుగుతోంది.

By:  Tupaki Desk   |   17 April 2024 1:09 PM GMT
రెండు జాతీయ సర్వేలు...మరీ ఇంత తేడానా ..?
X

ఏపీలో ఎన్నికల ముఖ చిత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయితే పోటాపోటీగా సన్నివేశం ఉంది అన్నది అంతా అంగీకరిస్తున్నారు. లోకల్ రీజనల్ సర్వేలు వెల్లువలా వస్తున్నాయి. ఈ సర్వేలు అన్నీ కూడా వైసీపీ టీడీపీల మధ్య తీవ్రమైన పోరు ఉందని స్పష్టం చేస్తున్నాయి. అంతే కాదు గెలిచిన పార్టీ ఓడిన పార్టీల మధ్య ఓట్ల షేర్ లో కూడా ఒక్క శాతం మాత్రమే తేడా ఉంటుందని అంచనా వేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో అన్ని సర్వేలూ అధ్యయనం చేసిన వారు మాత్రం అంత సులువుగా ఏపీ ఎన్నికలు ఉండవు ఒక అభిప్రాయానికి వస్తున్నారు. అంతే కాదు ఈ సర్వేలను చూస్తే చివరి ఓటు పండేంతవరకు టెన్షన్ అలాగే కంటిన్యూ అవుతుందని కూడా నమ్ముతున్నారు.

ఏపీలో చూస్తే అధికార వైసీపీ మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. అదే విధంగా టీడీపీ కూటమి చూస్తే కూడా అదే నమ్మకంతో ఉంది. తమ కూటమికి ఎదురు లేదని చెబుతోంది. ఈ విధంగా రెండు వైపులా కూడా విజయం తమదే అన్నట్లుగా ఉంది.

ఈ నేపధ్యంలో జాతీయ సర్వేలు ఏపీ నాడిని పట్టడంలో విఫలం అవుతున్నాయా లేక జాతీయ పార్టీల మెప్పు పొందేందుకు ఎంపీల వరకే పరిమితం అవుతూ ఆ నేపధ్యంలో ఏపీలో గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ని మిస్ అవుతున్నాయా అన్న చర్చ వస్తోంది.

తాజాగా చూస్తే రెండు జాతీయ సంస్థల సర్వేలు వచ్చాయి. ఆ రెండు సర్వేలు కూడా చాలా వ్యత్యాసంతో ఉండడంతో ఏపీ రాజకీయాల మీద అయోమయం కలుగుతోంది. మరీ అంత తేడాతో ఈ అంచనాలు ఉండడంతో ఏమిటీ ఈ సర్వేలు ఎవరిది నిజం ఏది నమ్మాలి అన్న డైలామాలో అయితే రాజకీయ పార్టీలతో పాటు రాజకీయాల మీద ఆసక్తి కలిగిన వారు అంతా పడిపోతున్నారు.

తాజాగా చూస్తే తనదైన సర్వేగా ఏబీపీ - సీ ఓటర్ సంస్థ వెలువరించింది. అందులో చూస్తే కనుక ఏపీలో ఎన్డీయే భారీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను 47 శాతం ఓట్లు పోల్ కావడంతో 20 స్థానాలను టీడీపీ కూటమి కైవశం చేసుకుంటుందని పేర్కొంది. 40 శాతం ఓట్లతో 5 లోక్‌సభ స్థానాలను వైసీపీ గెలుచుకోవచ్చని పేర్కొంది.

దీని కంటే ముందు వచ్చిన మరో జాతీయ సర్వే కూడా ఏపీలో ఎన్డీయేదే విజయం అని తేల్చింది. ఇండియా టుడే గ్రూప్ సి ఓటర్ సర్వే చూస్తే 17 లోక్‌సభ నియోజకవర్గాలతో ఇండియా టుడే గ్రూప్ మరియు సి ఓటర్ 17 లోక్‌సభ నియోజకవర్గాలతో ఎన్డీయే కూటమి గెలుస్తుందని పేర్కొంది. వైసీపీకి ఎనిమిది ఎంపీ సీట్లు వస్తాయని స్పష్టం చేసింది.

మరోవైపు లేటెస్ట్ గా వచ్చిన టైమ్స్ నౌ -ఏటీజీ సర్వే అయితే ఈ రెండు జాతీయ సర్వేలకు రివర్స్ లో తన అంచనాలు వెల్లడించింది. ఈ సంస్థ అంచనాల ప్రకారం చూస్తే వైసీపీకి 19 నుంచి 20 లోక్‌సభ స్థానాలు వస్తాయని అలాగే టీడీపీ, జనసేనలకు కలుపుకుని 3 నుంచి 4 లోక్‌సభ స్థానాలు, బీజేపీ ఓక సీటును కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది.

దీనిని చూసిన వారు జాతీయ సంస్థలు ఈ విధంగా భారీ తేడాతో అంచనాలు వేయడం ఏంటి అని చర్చించుకుంటున్నారు. ఇలా ఇండియా టుడే, టైమ్స్ నౌ సర్వే ఫలితాల్లో ఇంత వ్యత్యాసం ఉండడంతో ఏపీ ఓటర్లతో పాటు పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం అయోమయంలో పడుతున్నారు.

సరే ఎన్ని సర్వేలు వచ్చినా వారు ఎవరూ సర్వేశ్వరులు కారు. ఆ టైం కి తమకు అందిన సమాచారం అంటూ వారు ఎటూ తప్పించుకునే వీలు ఉంది. అసలైన సర్వేశ్వరులు ఎవరూ అంటే ఏపీ ప్రజలే. వారు ఎటూ మే 13న పోలింగ్ డే రోజున తమ అభిప్రాయం కుండబద్ధలు కొడతారు. వారు ఇచ్చే అసలైన ప్రజా తీర్పుతో ఏపీలో అసెంబ్లీకి ఎవరికి ఎన్ని సీట్లు, అలాగే పార్లమెంట్ సీట్లు ఎవరికి ఎన్ని అన్నది పూర్తి లెక్క తేలనుంది అని అంటున్నారు.

అందువల్ల జూన్ 4న ఫలితాలు వెలువడేవరకూ ఈ టెన్షన్ తప్పదు. ఇపుడు ప్రీ పోల్ సర్వేలు అపుడు పోస్ట్ పోల్ సర్వేలు అంటూ ఆయా సంస్థలు ఎటూ హల్ చల్ చేస్తాయి. కానీ జూన్ 4న వచ్చేది రియల్ ఫలితం. అప్పటివరకూ వేచి ఉండాల్సిందే మరి.