లోక్ సభలో ఉన్నది 543 సీట్లు అయితే.. షెడ్యూల్ 544 స్థానాలకు ఎలా?
తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ లో మాత్రం 544 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నట్లుగా పేర్కొంది. ఎందుకలా? ఒక స్థానం పెరిగిందా?
By: Tupaki Desk | 17 March 2024 5:38 AM GMTసార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనలో ఒక ఆసక్తికర అంశంపై జోరు చర్చ సాగుతోంది. షెడ్యూల్ ను చూసిన వారంతా.. వెంటనే సందేహాన్ని వ్యక్తం చేసేలా ఉన్న ఈ అంశం మీద సీఈసీ సైతం స్పందించింది. క్లారిటీ ఇచ్చింది. ఇంతకూ విషయం ఏమంటే.. లోక్ సభలో ఉన్న ఎంపీ స్థానాలు 543 మాత్రమే.
తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ లో మాత్రం 544 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నట్లుగా పేర్కొంది. ఎందుకలా? ఒక స్థానం పెరిగిందా? మరి.. అలాంటిదేమీ లేని వేళ.. ఎందుకు అలాంటి పరిస్థితి ఉంది? అన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు తెర మీదకు వస్తాయి.
ఈశాన్య రాష్ట్రంలోని ఒక పార్లమెంట్ స్థానానికి అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో.. సదరు ఎంపీ స్థానం రెండుసార్లు రెండు దశల్లో నమోదు కావటంతో.. మొత్తం ఎంపీ స్థానం లెక్కలో తేడా వచ్చింది. మణిపూర్ లోని ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలోని ప్రత్యేక పరిస్థితులు ఇంతటి చర్చకు కారణంగా చెప్పాలి. ఇటీవల కాలంలో మణిపూర్ లో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనల గురించి తెలిసిందే. నెలల తరబడి సాగుతున్న ఈ పరిణామాలు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మణిపూర్ లో ఇన్నర్.. ఔటర్ మణిపూర్ లోక్ సభా స్థానాలు ఉన్నాయి. అందులో ఏప్రిల్ 19, 26 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఇన్నర్ మణిపూర్ తో పాటు ఓటౌర్ మణిపూర్ కు చెందిన పలు సెగ్మెంట్లలో తొలి.. రెండో దశలో పోలింగ్ జరగనుంది. ఇటీవల పరిస్థితుల నేపథ్యంలో ఈ తరహాలో పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో.. ఒకే ఎంపీ స్థానాన్ని రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్న కారణంగా.. సదరు ఎంపీ స్థానం రెండు దశల్లోనూ నమోదైంది. ఈ కారణంగానే మొత్తంగా ఉండాల్సిన 543 స్థానాలు కాస్తా 544 స్థానాలుగా మారాయి.