Begin typing your search above and press return to search.

లోక్ సభ ఎన్నికల కోసం ఇంత పెద్ద జట్టా కేసీఆర్?

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్.. హరీశ్ లు కీలక భూమిక పోషించారు

By:  Tupaki Desk   |   31 Dec 2023 5:06 AM GMT
లోక్ సభ ఎన్నికల కోసం ఇంత పెద్ద జట్టా కేసీఆర్?
X

అధికారం ఖాయమని భావించిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము కలలో కూడా ఊహించని రీతిలో ఓటమి పాలైన బీఆర్ఎస్.. ఇప్పడిప్పుడే ఆ షాక్ నుంచి కోలుకుంటోంది. మరో మూడు నెలల్లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఆశావాహంగా లేకుంటే మొదటికే మోసం అన్నట్లుగా గులాబీ పార్టీ పరిస్థితి నెలకొంది. అందుకే.. లోక్ సభ ఎన్నికలకు అమితమైన ప్రాధాన్యతను ఇవ్వాలని కోరుతున్నారు. లోక్ సభ ఎన్నికల కార్యాచరణ మీద ఫోకస్ చేసిన గులాబీ బాస్ కేసీఆర్.. పార్టీకి సంబంధించి ఒక కోర్ టీంను ఏర్పాటు చేశారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్.. హరీశ్ లు కీలక భూమిక పోషించారు. త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో మాత్రం.. వీరిద్దరితో పాటు మరికొందరికి కూడా కీలక బాధ్యతల్ని అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ఏర్పాటు చేసిన టీంలో కేటీఆర్.. హరీశ్ రావులతో పాటు పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు.. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. మాజీ స్పీకర్ మధుసూదనాచారి.. పోచారం శ్రీనివాసరెడ్డి.. మాజీమంత్రులు జగదీశ్ రెడ్డి. . నిరంజన్ రెడ్డి.. ప్రశాంత్ రెడ్డి తదితరులు సభ్యులుగా ఎంపిక చేయటం గమనార్హం.

మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను మాత్రం ఈ జట్టు నుంచి తప్పించారు. దీనికి కారణం.. ఆయన వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తుండటమే. లోక్ సభ ఎన్నికల సన్నాహాకాల్లో భాగంగా జనవరి మూడో తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు విడతల్లో లోక్ సభ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాక సమావేశాల్ని నిర్వహించాలని నిర్ణయించారు. లోక్ సభ సెగ్మెంట్ల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు మొదలుకొని మండలస్థాయి నాయకుల వరకు ఈ భేటీలకు ఆహ్వానిస్తున్నారు.

ఓటమి వేళ.. గులాబీ బాస్ కేసీఆర్ ఫోకస్ కాస్త మారిందన్న మాట వినిపిస్తోంది. 2014, 2019 లోక్ సభ ఎన్నికలు.. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ ల వారీగా వివిధ పార్టీలకు లభించిన ఓట్ల మీద ఇప్పటికే ఒక ప్రైవేటు సంస్థతో పోస్టమార్టం చేసిన నివేదికను గులాబీ బాస్ సునిశితంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో బూత్ స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో పార్టీ తరఫున క్రియాశీలకంగా పని చేసిన పార్టీ నేతల వివరాల్ని కూడా సేకరిస్తున్నారు.

అదే సమయంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసిన కింది స్థాయి నేతల పని తీరును మదింపు సందర్భంగా కీలక అంశాల్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఓటమి వేళ.. మొత్తం పార్టీ వ్యవస్థను ప్రక్షాళన చేయటంతో పాటు.. పార్టీ కోసం కమిట్ మెంట్ తో పని చేసే వారిని గుర్తించి.. వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా తాజాగా ఎదురైన ఓటమి గులాబీ అధినాయకత్వాన్ని కళ్లు తెరిచేలా చూడటమే కాదు.. కింది స్థాయి వరకు పార్టీలో అసలేం జరుగుతుందన్న పోస్టు మార్టం జరుగుతోందన్న మాట వినిపిస్తోంది.