విశేషం.. ఒకటే పార్టీ.. ఒకటే సీటు.. నలుగురు డాక్టర్ల పోటీ
లోక్ సభ ఎన్నికలు మరో 75 రోజుల్లోపే జరగనున్నాయి. మూడోసారి ప్రధాని కావాలని మోదీ పట్టుదలతో ఉంటే
By: Tupaki Desk | 28 Jan 2024 11:30 PM GMTలోక్ సభ ఎన్నికలు మరో 75 రోజుల్లోపే జరగనున్నాయి. మూడోసారి ప్రధాని కావాలని మోదీ పట్టుదలతో ఉంటే.. ఆయన్ను ఎలాగైనా దించాలని కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష కూటమి దీక్షబూనింది. ఈ క్రమంలో రాష్ట్రాల వారీగా ఇన్నేసి సీట్లను హస్తం పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఆశలు తెలంగాణ మీద ఉన్నాయి. 17 స్థానాలున్న తెలంగాణలో కనీసం 12 గరిష్ఠంగా 15 సీట్లు సాధిస్తే.. కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కలుగుతుంది.
ఆ నియోజకవర్గం ప్రత్యేకం..
తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో నాగర్ కర్నూల్ ప్రత్యేకత వేరు. ఉమ్మడి మహబూబ్ నగర్ లోని ఈ సీటు దశాబ్దాలుగా ఎస్సీ రిజర్వుడ్ గా ఉంది. సుదూరాన ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు అనంతరాములు నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా గెలవడం విశేషం. ఈయన ఏపీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఈయన ఎవరో కాదు.. ప్రస్తుత తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు, తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్న మల్లు రవికి సోదరుడు. మల్లు అనంతరాములు మరణానంతరం రవి ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. కాగా, మల్లు రవి ఎంబీబీఎస్ వైద్యుడు.
మరో ముగ్గురూ 'డాక్టర్లే'
మల్లు రవి నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో ముందున్నారు. ఈయనకు అలంపూర్ మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ అబ్రహం, డాక్టర్ సంపత్ కుమార్ పోటీ ఇస్తున్నారు. వీరే కాక సీనియర్ నాయకుడు, నాగర్ కర్నూల్ నుంచి పలుసార్లు ఎంపీగా గెలిచిన డాక్టర్ మంద జగన్నాథం కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో జగన్నాథం, అబ్రహం ఇద్దరూ ఎంబీబీఎస్ సమయంలో సహధ్యాయులని చెబుతున్నారు. ఇక డాక్టర్ సంపత్ కుమార్ పీహెచ్ డీ చేశారు. 2014లో అలంపూర్ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత రెండుసార్లు ఓటమి పాలయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచి ఉంటే సంపత్ కు మంత్రి పదవి దక్కేది. ఇక డాక్టర్ అబ్రహం వైద్యుడిగా ఏపీలోని కర్నూలు జిల్లా కేంద్రంలో సుపరిచితులు. అంతకుముందు దుబాయ్ లో వైద్యుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన అలంపూర్ నుంచి ఓసారి కాంగ్రెస్, మరోసారి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గారు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ లో చేరారు. డాక్టర్ మంద జగన్నాథ కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇప్పుడు ఈ నలుగురు డాక్టర్లు ఒకటే ఎంపీ టికెట్ కు పోటీ పడుతుండడం విశేషమే. మరీ ముఖ్యంగా కర్నూలులో పేరున్న వైద్యుడు డాక్టర్ అబ్రహం నాగర్ కర్నూలులో పోటీకి దిగాలని చూడడం వైచిత్రి అనుకోవాలి.