Begin typing your search above and press return to search.

జేపీ నడ్డాను ప్రధాని మోడీ ఏం చేయనున్నారు?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరుసగా రెండోసారి ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు

By:  Tupaki Desk   |   10 Feb 2024 9:15 AM GMT
జేపీ నడ్డాను ప్రధాని మోడీ ఏం చేయనున్నారు?
X

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరుసగా రెండోసారి ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది జూన్‌ వరకు ఆయన పదవీ కాలం ఉంది. మరోవైపు ప్రస్తుతం జేపీ నడ్డా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవీకాలం కొద్ది రోజుల క్రితమే పూర్తయింది. వరుసగా రెండుసార్లు జేపీ నడ్డా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఆయనకు మూడోసారి పొడిగింపు వస్తుందా, రాదా అనే దానిపై చర్చ జరుగుతోంది. సాధారణంగా బీజేపీలో ఎవరికైనా రెండుసార్లకు మించి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వరు. ఈ నేపథ్యంలో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడైన జేపీ నడ్డాకు మూడోసారి పొడిగింపు ఉండదని అంటున్నారు.

జేపీ నడ్డాను ఆయన సొంత రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి లోక్‌ సభకు పోటీ చేయించవచ్చనే ప్రచారం జరుగుతోంది. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో కీలక నేతలు, జాతీయ స్థాయిలో పేరున్న నేతలు పోటీ చేస్తే ఆ ప్రభావం మిగతా స్థానాలపైన ఉంటుందని ప్రధాని మోదీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జేపీ నడ్డాను లోక్‌ సభకు పోటీ చేయించాలనే యోచనలో ఉన్నారని అంటున్నారు.

వాస్తవానికి జేపీ నడ్డా హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రెండుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు.

హిమాచల్‌ ప్రదేశ్‌ లో ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. దీంతో అక్కడ బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో నడ్డా తన సొంత రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌ నుండి రాజ్యసభకు వెళ్లే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయనను లోక్‌ సభకు పోటీ చేయించవచ్చనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌ నుంచి జేపీ నడ్డాను రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయని కూడా టాక్‌ నడుస్తోంది. ఎన్నికల సంఘం జనవరి 27న 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ 56 స్థానాల్లో అత్యధికంగా బీజేపీకే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో నడ్డాను లోక్‌ సభకు పోటీ చేయించాలా లేక రాజ్యసభకు పంపాలా అనేదానిపై ప్రధాని మోదీ ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

నడ్డాను రాజ్యసభకు పంపాలని నిర్ణయిస్తే ఆయనను వరుసగా మూడోసారి ఎంపీని చేసినట్టు అవుతుంది. తద్వారా ఒకరికి రెండుసార్లే రాజ్యసభ అవకాశం అనే బీజేపీ రూల్‌ కు బ్రేక్‌ పడుతుంది. ఇప్పటికే 2 సార్లు రాజ్యసభ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నవారు తమను కూడా మరోసారి పంపాలని కోరే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నడ్డాను ఏ సభకు పోటీ చేయిస్తారో మరో కొద్ది రోజుల్లో తేలనుంది. ఒకవేళ నడ్డా లోక్‌ సభకు పోటీ చేస్తే లోక్‌ సభకు పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది.