Begin typing your search above and press return to search.

లోక్ సభ స్పీకర్ ఎన్నిక.. వైసీపీకి తొలి పరీక్ష.. ఎవరి వైపు నిలుస్తుంది?

‘‘మాకు లోక్ సభలో నలుగురే సభ్యులు ఉండొచ్చు. రాజ్యసభలో 11 మంది ఉన్నారు.

By:  Tupaki Desk   |   25 Jun 2024 10:39 AM GMT
లోక్ సభ స్పీకర్ ఎన్నిక.. వైసీపీకి తొలి పరీక్ష.. ఎవరి వైపు నిలుస్తుంది?
X

‘‘మాకు లోక్ సభలో నలుగురే సభ్యులు ఉండొచ్చు. రాజ్యసభలో 11 మంది ఉన్నారు. మా అవసరం ఎప్పటికైనా అధికార కూటమికి ఉంటుంది’’ ఇదీ వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు. ఆయన ఏ ఉద్దేశంలో అన్నప్పటకీ అనూహ్యంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి లోక్ సభలో వైసీపీతో పని పడింది. అది కూడా స్పీకర్ ఎన్నిక వంటి ముఖ్యమైన కార్యక్రమం సందర్భంగా కావడం గమనార్హం.

చరిత్రలో తొలి పోటీలో..

భారత పార్లమెంటు చరిత్రలో లోక్‌ సభ స్పీకర్ కు తొలిసారిగా పోటీ అనివార్యమైంది. ఎన్డీఏలో ఉన్న టీడీపీ తొలుత ఈ పదవి కావాలని పట్టుబట్టినా.. తర్వాత తప్పుకొంది. ఇదే అదనుగా మరోసారి తన అభ్యర్థిని నిలిపింది బీజేపీ. 17వ లోక్ సభలో స్పీకర్ గా చేసిన ఆ పార్టీ ఎంపీ ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థిగా కేరళకు చెందిన కొడికున్నిల్ సురేష్‌ ను నిలిపింది. ఎన్డీఏకు దీటుగా లోక్‌ సభలో తమకు బలం ఉండడంతో ఇండియా కూటమి ఎక్కడా తగ్గే ఉద్దేశంలో లేదు.

క్రాస్ ఓటింగ్ తప్పదా?

లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటివరకు బీజేడీ వంటి పార్టీలు తటస్థంగా ఉంటూ వచ్చాయి. ఇలాంటి తమకు మద్దతు ఇస్తాయని ఇండియా కూటమి ఆశిస్తోంది. అయితే, నలుగురు ఎంపీలున్న ఏపీ ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏమిటో చూడాలి.

అప్పట్లో మద్దతు...? మరిప్పుడు..?

ఏపీలో ప్రతిపక్షంగా, అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అన్నివిధాల మద్దతు ఇచ్చింది. రాష్ట్రపతి ఎన్నిక సహా.. ప్రతి బిల్లుపైనా స్పందించింది. సీఏఏ వంటి వాటికి తప్ప. వాస్తవానికి వైసీపీ ఎన్డీఏలో ఎప్పుడూ లేదు. అయినా బయటినుంచి అంతకుమించి మద్దతు ఇచ్చింది.

మరిప్పుడు ఏం చేస్తారు?

ఏపీలో ఇటీవలి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన వైసీపీకి తొలి పరీక్ష ఎదురైంది. అటు ఏపీ అధికార పార్టీ టీడీపీ.. ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తోంది. స్పీకర్ ఎన్నికలో వైసీపీ ఏ వ్యూహం అనుసరిస్తుందనేది కీలకం. నలుగురు ఎంపీలు ఎవరికి ఓటు వేస్తారో చూడాలి. ‘ఇండియా’ అభ్యర్థి కొడికున్నిల్ సురేష్‌ కు ఓటు వేస్తే మోదీకి కోపం వస్తుంది. ఇక ఎన్డీఏకు అంశాలవారీ మద్దతు ఇస్తామని ఇప్పటికే వైసీపీ చెప్పింది. అయితే, స్పీకర్ ఎన్నిక రాష్ట్ర, దేశ ప్రయోజనాల అంశం కాదు. దీంతో ఓటింగ్ కు దూరంగా అయినా ఉండొచ్చు.