లోక్ సభలో బాలయోగి వారసత్వానికి ఆ ఛాన్స్ కనిపిస్తోందట!
ఈ సందర్భంగా మంత్రులకు శాఖల కేటాయింపు, బాధ్యతల స్వీకరణ కూడా పూర్తయిన పరిస్థితి
By: Tupaki Desk | 14 Jun 2024 12:47 PM GMTకేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీయే సర్కార్ కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రులకు శాఖల కేటాయింపు, బాధ్యతల స్వీకరణ కూడా పూర్తయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ గా ఎవరిని ఎన్నుకోబోతున్నారనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన ఎన్నిక 26న జరగనుంది.
అవును... కేంద్రంలో బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీయే పక్షాలపై ఆధారపడాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానంగా టీడీపీ, జేడీయూలు ప్రభుత్వంలో కీలక భూమిక పోషించబోతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో... లోక్ సభ స్పీకర్ పదవి కోసం ఈ రెండు పార్టీలూ పట్టుబడుతున్నట్లు కథనాలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు... ఈ స్పీకర్ పోస్ట్ ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దని టీడీపీ, జేడీయూలను ఇండియా కూటమి పార్టీలు కోరుతుండటం గమనార్హం! ఇందులో భాగంగా... ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా ఈ పదవి బీజేపీకి మాత్రం వదలొద్దని కోరుతున్నాయని అంటున్నారు.
అటు టీడీపీ, ఇటు జేడీయూ ఎవరైనా పర్లేదని.. బీజేపీకి బదులుగా ఈ రెండు పార్టీల్లో ఒకరు ఈ స్పీకర్ పదవి తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఇందులో భాగంగా... ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, శివసేన (ఉద్ధవ్) వర్గంతో పాటు డీఎంకే, ఆం ఆద్మీ పార్టీలు కూడా ఈ విషయంలో పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు!
ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ పోస్ట్ వదులుకోవడానికి బీజేపీ సిద్ధపడితే, అంగీకరిస్తే మాత్రం ఆ పోస్ట్ జేడీయూకి దక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా జేడీయూకి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ ఇప్పటికే పదవిలో ఉండటంతో.. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ వద్దంటుందట ఆ పార్టీ.
దీంతో... లోక్ సభ స్పీకర్ జేడీయూకి ఇచ్చి.. టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే... ఒకప్పటి టీడీపీ ఎంపీ, దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడికి హరీష్ మాధుర్ ని ఆ స్థానంలో కుర్చోబెట్టి అవకాశాలను కొట్టిపారేయలేమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.