Begin typing your search above and press return to search.

ఇది లండన్.. బెంగాలీలో బోర్డు ఏంది? బ్రిటన్ ఎంపీ అసహనం

బ్రిటన్ రాజధాని లండన్ లోని తూర్పు ప్రాంతంలోని వైట్ చాపెల్ స్టేషన్ వద్ద బెంగాలీ.. ఇంగ్లిషు భాషల్లో ఒక సైన్ బోర్డును ఏర్పాటు చేశారు.

By:  Tupaki Desk   |   11 Feb 2025 5:06 AM GMT
ఇది లండన్.. బెంగాలీలో బోర్డు ఏంది? బ్రిటన్ ఎంపీ అసహనం
X

రోజులు గడుస్తున్న కొద్దీ.. టెక్నాలజీ అంతకంతకూ పెరుగుతున్న వేళలో మనుషుల మధ్య సోదరభావం పెరగాల్సింది పోయి.. నా ప్రాంతం.. నా దేశం.. నా మతం.. నా కులం.. నా భాష.. ఇలాంటి సంకుచితత్త్వం పెరుగుతోంది. అర్థం లేని అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చి భావోద్వేగాల్ని రెచ్చగొట్టేలా చేస్తున్న వైనాలు పెరుగుతున్నాయి. ఇలాంటి వేళ.. ప్రతి విషయానికి అనవసరంగా రియాక్టు అయ్యే కన్నా.. ఆలోచనల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిటన్ రాజధాని లండన్ లోని తూర్పు ప్రాంతంలోని వైట్ చాపెల్ స్టేషన్ వద్ద బెంగాలీ.. ఇంగ్లిషు భాషల్లో ఒక సైన్ బోర్డును ఏర్పాటు చేశారు.

నిజానికి దీన్ని ఏర్పాటు చేయటంలో ఒక ఉద్దేశం ఉంది. కానీ.. ఆ విషయాన్ని వదిలేసిన బ్రిటన్ ఎంపీ రూపర్ట్ లోవ్ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశారు. ఇది లండన్.. ఇక్కడ బోర్డులు ఆంగ్లంలోనే ఉండాలంటూ.. బెంగాలీ, ఇంగ్లిష్ లో ఉన్న స్టేషన్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ దీనిపై స్పందిస్తూ.. ‘అవును’ అంటూ సమాధానం ఇచ్చారు.

బ్రిటన్ ఎంపీ వాదనకు మస్క్ సైతం సమర్థించటంతో ఈ పోస్టు వైరల్ గా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరుదీన్ని స్వాగతిస్తుంటే.. మరికొందరు ఈ తీరును తప్పు పడుతున్నారు. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇతర దేవాల సంస్క్రతిని గౌరవించాల్సిన అవసరం ఉందని హితవు పలుకుతున్నారు. ఇంతకీ లండన్ లో ఒక బోర్డును బెంగాలీలో ఏర్పాటు చేయటమంటే మాటలు కాదు. దాని వెనుక ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది.

అదే విషయాన్ని అరా తీస్తే.. అసలు విషయం బయటకు వచ్చింది. తూర్పు లండన్ డెవలప్ మెంట్ కోసం బెంగాలీ సమాజం చేసిన సేవలను గుర్తిస్తూ వైట్ చాపెల్ స్టేషన్ వద్ద ఇంగ్లిషుతో పాటు బెంగాలీలోనూ ఈ బోర్డు ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ బోర్డు అప్పట్లో అందరి మన్ననలు పొందింది. ఈ రోజు.. బ్రిటన్ ఎంపీ ఇరుకు మనస్తత్వంతో చేసిన వ్యాఖ్యలు సరికావన్న మాట వినిపిస్తోంది.