లండన్ లోని ఇండియా క్లబ్ ఎందుకు మూత పడింది?
భారత్ కు స్వాతంత్ర్యం వచ్చాక నాలుగేళ్లకు అంటే.. 1951లో లండన్ లో ఏర్పడింది ఇండియా క్లబ్.
By: Tupaki Desk | 19 Sep 2023 11:35 AM GMTభారత్ అనే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా నేడు భూమి బంగారమే.. ఇదివరకంటే డబ్బు (లిక్విడ్ క్యాష్) చేతిలో ఉండడం ప్రధానంగా భావించేవారు. ఇప్పుడు మాత్రం పెట్టుబడి అంతా భూమిపై పెడుతున్నారు. పాతిక ముప్పై ఏళ్ల కిందట లేని డిమాండ్ నేడు భూమికి నెలకొంది. దీంతో అన్మదమ్ములు.. తండ్రీకొడుకులు.. అక్కాతమ్మళ్లు.. అన్నాచెల్లెళ్లు.. ఇలా అయినవారందరి మధ్యా భూమి తగాదాలు సహజంగా మారాయి. కాగా, మనదగ్గరే ఇలా ఉంటే.. అత్యంత డెవలప్ అయిన లండన్ లో రియల్టీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ సెగ ఏకంగా లండన్ లోని ఇండియా క్లబ్ కూ తగిలింది.
72 ఏళ్ల కిందట..
భారత్ కు స్వాతంత్ర్యం వచ్చాక నాలుగేళ్లకు అంటే.. 1951లో లండన్ లో ఏర్పడింది ఇండియా క్లబ్. ఇండియా లీగ్ దీనిని నెలకొల్పింది. ఈ క్లబ్ ను ఈ నెల 15న మూసివేశారు. అలా 72 ఏళ్ల ప్రస్థానానికి తెరపడింది. ఇకపై ఆ క్లబ్ మరెప్పుడూ తెరుచుకోదు. పేరులో ఉన్నట్లే ఈ క్లబ్ భారతీయులకు ఉపయోగపడేది. భారతీయ వంటకాల రెస్టారెంట్, బ్రిటన్ లో స్థిరపడిన భారతీయులు కలుసుకునే ప్రదేశం ఇది. బ్రిటిషర్లే కాక భారతీయ నాయకులూ ఇక్కడకు వచ్చేవారు.
ఆస్తులపై కన్నేసి..
లండన్ లో ఇండియా క్లబ్ స్ట్రాండ్ కాంటినెంటల్ హోటల్ ప్రదేశంలో ఉంది. లండన్ అంటేనే మహా నగరం. ప్రిసిద్ధ నగరం. ప్రపంచంలో ఎక్కడెక్కడివారో వచ్చి ఇక్కడ స్థిరపడతారు. అలాంటిచోట గజం అయినా భూమి రూ.కోట్లలోనే ఉంటుంది. ఇలానే.. క్లబ్ చుట్టూ ఉన్న వాణిజ్య ఆస్తుల విలువ గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతోనే ఇండియా క్లబ్ మూతపడడం జరిగినట్లుగా స్పష్టమవుతోంది. దీని తర్వాత ప్రక్రియ ఏమిటన్నది స్పష్టత లేకున్నా.. క్లబ్ స్థలం ఆస్తులు ఏమైనా ఉంటే అవి రియల్టర్ల చేతుల్లోకి వెళ్లనున్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
బ్రిటిష్ సంస్థ స్థాపన..
లండన్ లోని ఇండియా క్లబ్ ను స్థాపించింది ఓ బ్రిటీష్ సంస్థ. 1951లో ప్రారంభమైనప్పటికీ.. పూర్వ రూపంలో ఇది భారత స్వాతంత్ర్యం, స్వరాజ్యానికి మద్దతుగా నిలిచిందని చెబుతారు. భారత్ కు స్వాతంత్య్రం అనంతరం ఈ క్లబ్ ఇరు దేశాల మధ్య స్నేహాన్ని పెంపొందించే వేదిక మారిందట.
ఆసియా సంతతికి అండ..
యూరప్ లో ముఖ్యంగా బ్రిటన్ లో ఆసియా సంతతికి సేవలందించేది ఇండియా క్లబ్. ఇండియా లీగ్ వంటి గ్రూప్‌లకు క్లబ్ అనతికాలంలోనే స్థావరంగా మారింది. ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్, ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్, ఇండియన్ సోషలిస్ట్ గ్రూప్ ఆఫ్ బ్రిటన్ కార్యకలాపాలకు ఉపయోగపడేది. అంతేకాదు.. బ్రిటన్‌లోని ఆసియన్ల రోజువారీ జీవితం కష్టతరంగా ఉన్న సమయంలో లండన్ క్లబ్ ఉపఖండంలోని ప్రవాస సంఘాలకు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది.
కాంగ్రెస్ నేత శశిథరూర్ కు సంబంధం
జర్నలిస్ట్ చందన్ థరూర్ ఇండియా క్లబ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆయన కుమార్తె స్మితా థరూర్ లండన్‌లోనే ఉంటున్నారు. ఈమె సోదరుడే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. భారత మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, తొలి బ్రిటీష్ ఇండియన్ ఎంపీ దాదాభాయ్ నౌరోజీ, తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్, కళాకారుడు ఎంఎఫ్ హుస్సేన్, చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ తదితరులు కూడా ఈ క్లబ్ ను సందర్శించారు. కాగా, ఇండియా క్లబ్ స్థాపనలో దౌత్యవేత్త, భారత మాజీ రక్షణ మంత్రి వీకే కృష్ణ మీనన్ పాత్ర కూడా ఉంది.
పార్సీల నిర్వహణలో..
పార్సీ సమాజానికి చెందిన యాద్గార్ మార్కర్.. గోల్డ్‌సాండ్ హోటల్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా 1997 నుంచి తన భార్య ఫ్రాంనీ, కుమార్తె ఫిరోజాతో కలిసి లండన్ క్లబ్ ను నిర్వహిస్తున్నారు. ఆయన లండన్ క్లబ్‌ను కాపాడేందుకు ‘సేవ్ ఇండియా క్లబ్’ పేరుతో పబ్లిక్ అప్పీల్‌ను కూడా ప్రారంభించారు. అలా 2018లో భవనం పాక్షిక కూల్చివేతను నిరోధించారు. కాగా, లండన్ క్లబ్ నిర్వాహకులు హోటల్‌ను ఆధునికీకరించాలంటూ భూస్వాముల నుంచి నోటీసు అందుకున్నారు. వెస్ట్‌మినిస్టర్ సిటీ కౌన్సిల్ విస్తరణ ప్రణాళిక దరఖాస్తును తిరస్కరించింది. దీనికి అనుమతి మంజూరు చేయడమంటే ఒక సాంస్కృతిక స్థలాన్ని దెబ్బతీయడమేనని పేర్కొంది. కాగా, కొవిడ్ కారణంగా వచ్చిన లాక్‌డౌన్ యూకేలోని రెస్టారెంట్ వ్యాపారాలను దెబ్బతీసింది. జీవన వ్యయ సంక్షోభంతో అద్దెలు భారీగా పెరిగాయి. దీంతో ఇండియా క్లబ్‌ను నిర్వహించడం యజమానులకు కష్టతరమైంది. రెస్టారెంట్ ను తరలించేందుకు సమీపంలోని మరో ప్రదేశం వెదుకుతున్నామని తెలిపారు.