Begin typing your search above and press return to search.

న్యూ ఎక్స్పీరియన్స్... తెరుచుకున్న తర్వాత మొరాయించిన లండన్ బ్రిడ్జ్!

ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌ లోని థేమ్స్ నదిపై నిర్మించిన ప్రతిష్ఠాత్మక లండన్ టవర్ బ్రిడ్జి వద్ద అనూహ్య సంఘటన చోటుచేసుకుంది

By:  Tupaki Desk   |   29 Sep 2023 10:14 AM GMT
న్యూ ఎక్స్పీరియన్స్... తెరుచుకున్న తర్వాత మొరాయించిన లండన్ బ్రిడ్జ్!
X

ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌ లోని థేమ్స్ నదిపై నిర్మించిన ప్రతిష్ఠాత్మక లండన్ టవర్ బ్రిడ్జి వద్ద అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ఈ లండన్ బ్రిడ్జి తెరుచుకుంటున్నప్పుడు, తిరిగి యదాస్థానానికి చేరుకునేటప్పుడూ చూడాలని పర్యాటకులు ఉబలాటపడుతుంటారు. ఈ క్రమంలో తెరుచుకున్న తర్వాత.. తిరిగి మూసుకోకపోతే ఏమవుతుందనేది తాజాగా అనుభవంలోకి వచ్చింది.

అవును... ఎప్పటిలాగానే గురువారం మధ్యాహ్నం కూడా ఈ బ్రిడ్జ్ తెరుచుకుంది. బ్రిడ్జి కిందనుంచి నీటిలో వెళ్లాల్సిన ఓ బోటుకు దారిచ్చింది. అయితే, ఆ తర్వాత మూసుకోవడానికి మొరాయించింది. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. చిన్న టెక్నికల్ సమస్య వల్ల ఇలా జరిగిందని చెబుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

"తెరుచుకున్న బ్రిడ్జి చూడ్డానికి చాలా బాగుంది.. అది తిరిగి మూసుకోకపోవడంతో మాత్రం గందరగోళం ఏర్పడింది.. టూరిస్టు బస్సులు సహా ఎన్నో వాహనాలు నిలిచిపోయాయి" అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలపగా... బ్రిడ్జ్‌ పైకి లేచి ఉండటం చూసేందుకు మొదట బాగానే అనిపించింది కానీ... ట్రాఫిక్‌ పెరగడంతో ఆందోళన వ్యక్తం అయ్యింది.. అయితే, అరగంట అంతరాయం తర్వాత ఆ బ్రిడ్జ్‌ కిందికి దిగడంతో తిరిగి అందరి మొహాల్లో సంతోషం కనిపించింది" అని మరొకరు తెలిపారు.

కాగా... థేమ్స్‌ నదిపై ఈ కదిలే బ్రిడ్జ్‌ నిర్మాణం 1894లోనే పూర్తయింది. దీని జంట టవర్లు నదికి 61 మీటర్ల ఎత్తులో ఉండగా.. ఈ రెండు టవర్ల మధ్య నిర్మించిన స్కైవాక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గ్రేటర్ లండన్ బారోగ్స్ ఆఫ్ టవర్ హామ్లెట్స్, లండన్‌ లోని సౌత్‌ వార్క్ మధ్య థేమ్స్ నదిపై ఇది నిర్మించబడింది. 76 మీటర్లు (250 అడుగులు) వెడల్పు, 240 మీటర్లు (800 అడుగులు) పొడవుతో ఈ బ్రిడ్జి ఎంట్రన్స్ ఉంటుంది!