Begin typing your search above and press return to search.

సుదీర్ఘ ఎన్నికలు...దేశాన్ని 1952 నాటికి తీసుకెళ్లారా...!?

దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న టైం అచ్చంగా 82 రోజులు.

By:  Tupaki Desk   |   17 March 2024 7:00 AM GMT
సుదీర్ఘ ఎన్నికలు...దేశాన్ని 1952 నాటికి తీసుకెళ్లారా...!?
X

భారత్ వెలిగిపోతోంది అభివృద్ధి చెందుతోంది అని పదే పదే ఏలికలు చెబుతారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని కూడా చాలా గొప్పగా నినాదాలు ఉన్నాయి. కానీ ఆచరణలో చూస్తే మాత్రం ఏడు దశాబ్దాల వెనకనే ఇంకా ఉన్నామా అన్న భావన వచ్చేలా ఉంటోంది అని అంటున్నారు. ఇది మేధావులు ప్రజాస్వామ్య ప్రియులతో పాటు దేశంలోని ప్రతిపక్షాల మాటగా ఉంది.

దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న టైం అచ్చంగా 82 రోజులు. ఇది రికార్డు టైం అని అంటున్నారు. ఇంత ఎక్కువ టైం ఎపుడూ ఇటీవల కాలంలో జరగలేదు అని కూడా అంటున్నారు. ఒక్కసారి వెనక్కి వెళ్తే 1952లో తొలి ఎన్నికల్లోనే ఇలా జరిగింది అని గుర్తు చేస్తున్నారు.

అప్పట్లో 1951 అక్టోబర్ 25 నుంచి 1953 ఫిబ్రవరి 21 దాకా సుదీర్ఘంగా ఎన్నికలు జరిగాయి. అంటే ఏకంగా నాలుగు నెలల పాటు 130 రోజుల పొడవున ఎన్నికల ప్రక్రియ సాగింది అని అంటున్నారు. ఇపుడు చూస్తే ఎన్నికల షెడ్యూల్ కి ఎన్నికల కోడ్ ఎత్తివేసే జూన్ 6వ తేదీకి మధ్యన 82 రోజులు బిగిసి ఉంది.

ఈ మధ్యలో జరిగిన అనేక ఎన్నికలు చాలా తక్కువ టైం లోనే పూర్తి అయ్యాయని గుర్తు చేస్తున్నారు. 1962 నుంచి 1989ల మధ్యలో చూసుకుంటే ఎన్నికల ప్రక్రియ అంతా నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి పది రోజుల వ్యవధిలోనే పూర్తి అయింది అని గుర్తు చేస్తున్నారు. ఇంకా చిత్రం ఏంటి అంటే 1980లో చూస్తే జనవరి 3 నుంచి జనవరి 6 వరకూ మధ్యలో పూర్తి అయ్యాయని చెబుతున్నారు.

అదే విధంగా చూస్తే నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే చూస్తే కనుక 2004లో 21 రోజులు, 2009లో 30 రోజులు 2019లో 39 రోజుల సమయం ఎన్నికల ప్రక్రియకు పట్టిందని అంటున్నారు. కానీ ఇపుడు ఎన్నికల నోటిఫికేషన్ నుంచి చూసుకున్నా ఏకంగా 45 పై దాటుతోందని అని అంటున్నారు.

దీని మీద ఇండియా కూటమి విరుచుకుపడుతోంది. ఇంత పెద్ద ఎత్తున ఎనభై రోజుల పాటు ఎన్నికల కోడ్ పెడితే పాలన ఏమి కావాలి అభివృద్ధి సంగతి ఏంటి అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గె ప్రశ్నించారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఇంత సుదీర్ఘ ప్రక్రియ అవసరమా అని ఆయన నిలదీశారు.

కేవలం మూడు లేక నాలు దశలలో దేశమంతా ఎన్నికలు నిర్వహించవచ్చునని ఖర్గే అంటున్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే కూడా అదే మాట అంటున్నారు. వివిధ దశలుగా అధిక సమయంతో ఎన్నికలు నిర్వహించడం వల్ల అధికార పక్షానికే ఇదంతా లాభంగా ఉంటుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్ పెట్టడం అంటే అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. తమిళనాడుకు చెందిన సినీ నటుడు రాజకీయ నేత అయిన కమల్ హాసన్ కూడా సుదీర్ఘమైన ఎన్నికల తీరు పట్ల విమర్శలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెబుతున్నారు ఒక్క రోజులో ఎన్నికలు దేశమంతా ఎందుకు పెట్టలేకపోతున్నారు అని నిలదీశారు.

ఇదిలా ఉంటే దేశంలో సమస్యాత్మక ప్రాంతాలు అనేకం ఉండడం, భిన్న మతాలకు చెందిన వారి పండుగలు ఉండడం వంటి వాటి వల్లనే ఏడు దశలలో ఎన్నికలు అని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఒక్క మాట చెప్పుకోవాలి. ఎన్నికల ప్రక్రియ కారణంగా పాలన ఎక్కడ చూసినా స్తంభిస్తోంది. అదే విధంగా ప్రజలకు జరగాల్సిన మేలు జరగదు.

ఏ ఎన్నికకు ఆ ఎన్నికల్లో ఓటర్లు పెరుగుతున్నారు. కానీ దానికి కూడా మార్గాలు ఉన్నాయని అంటున్నారు. ఒకేసారి ఎన్నికలు జరిపించడం లేదా రెండు మూడు దశలలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టి చేయగలమని అంటున్నారు. దీని మీద ప్రజాస్వామ్య ప్రియులు ఎన్నికల సంస్కరణలు కోరేవారు అంతా ఆలోచించాలని అంటున్నారు.