Begin typing your search above and press return to search.

సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ ఈసారి ఏపీలో !

కానీ ఈసారి మాత్రం చాలా సుదీర్ఘమైన ప్రక్రియగానే నడచింది.

By:  Tupaki Desk   |   11 May 2024 3:02 PM GMT
సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ  ఈసారి ఏపీలో !
X

ఆంధ్రప్రదేశ్ లో ఇంతటి సుదీర్ఘమైన ఎన్నిక ఇటీవల కాలంలో ఎవరూ చూడలేదు. గడచిన నాలుగైదు ఎన్నికలు తీసుకున్నా అవి నెల రోజుల కంటే ఎక్కువ సమయం పట్టలేదు. కానీ ఈసారి మాత్రం చాలా సుదీర్ఘమైన ప్రక్రియగానే నడచింది.

ఎంతలా అంటే మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. మే 13న పోలింగ్. అది కూడా నాలుగో విడతలో. ఏపీలో ఎపుడూ కూడా తొలి విడత లేదా మలి విడతలోనే పోలింగ్ ఉంటూ వచ్చింది. కానీ ఈసారి ఎందుకో నాలుగవ విడతకు మార్చేశారు.

దాంతో రెండు నెలల పాటు ప్రచారానికే అయిపోయింది. దాని కంటే ముందు గట్టిగా చెప్పాలీ అంటే ఆరు నెలల నుంచి నుంచి విపక్షాలు భారీ ఎత్తున ప్రచారం చేస్తూ జనంలో ఉన్నాయి. ఇక అధికార పక్షం వైసీపీ అయితే రెండేళ్ల ముందుగానే గడప గడపకు అని తమ పార్టీ వారిని పంపించింది.

ఇలా ఏపీలో ఎపుడూ హీటెత్తిపోయి ఉన్న ఎన్నికలకు ఈసారి భారీ ఎత్తున టైం కూడా ప్రచారానికి దొరికినట్లు అయింది. దాంతో ఏ మాత్రం లోటు లేకుండా అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించాయి. ఎక్కడా ఎవరూ కంగారు పడలేదు. కలవరపడలేదు.

ఏపీ సీఎం జగన్ అయితే 106 నియోజకవర్గాల్లో ప్రచారాలు సభలు రోడ్ షోలు ఈసారి నిర్వహించారు. ఇక ఇందులో చూస్తే 17 సిద్ధం సభకు ఉన్నాయి. అలాగే మరో 34 బహిరంగ సభలు కూడా ఉనాయి. అదే విధంగా 14 నియోజకవర్గాలలో రోడ్ షోలు జగన్ నిర్వహించారు.

అదే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని తీసుకుంటే ఆయన 89 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజాగళం సభలు సోలోగానిర్వహించారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 43 సభలలో పాలు పంచుకున్నారు. ఇక తెలుగుదేశం జనసేన కలసి ఒక డజన్ దాకా సభలను నిర్వహించాయి.

ఈసారి బీజేపీ పెద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఏపీలో నాలుగు సభలను నిర్వహించడం విశేషం. ఆయన అటు రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్రాలలో పర్యటించారు. అమిత్ షా రాయలసీమలో సభను నిర్వహిస్తే రాజ్ నాధ్ సింగ్ నితిన్ గడ్కరీ పీయూష్ గోయెల్ వంటి బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు ఏపీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గతంలో లేని విధంగా ఈసారి కాంగ్రెస్ కూడా ఎన్నికల సభలు నిర్వహించింది.

ఆ పార్టీ కొత్త ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల కూడా ఏపీలో చాలా చోట్ల తిరిగారు. సభలు పెట్టారు. మొత్తానికి చూస్తే ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏపీలో పోటా పోటీగా సభలు జరిగాయని చెప్పాల్సి ఉంది. ఇచ్చాపురం నుంచి మొదలుపెడితే అనంతపురం లోని హిందూపురం దాకా అధినేతలు కలియతిరిగారు.

విమర్శలు కూడా ఈసారి తీవ్రంగానే చేసుకున్నారు. దూషణ పర్వం కూడా జోరుగా సాగింది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఏపీలో ఈసారి ఎన్నికలు వింత అనుభవం గానే చూడాలి. ఇక ఏపీలో మే రెండవ వారం దాకా ప్రచారం సాగింది. వేసవి ఎండలలో అది కూడా నలభై అయిదు డిగ్రీలలో తిరుగుతూ అధినేతలతో పాటు అభ్యర్థులు కూడా ప్రచారం చేయడం ఈసారి ప్రత్యేకత.

జనాలు సైతం ఎండలలో వచ్చి ఆయా పార్టీల సభలలో పంచుకున్నారు. దాదాపుగా చూస్తే కనుక అన్ని పార్టీల సభలూ జనంతో సందడి చేశాయి. ఏ సభలను చూసినా జనమే జనం అన్నట్లుగా కనిపించారు. అలాగే రాజకీయ పార్టీల నేతలు క్యాడర్ లో పట్టుదల బాగా కనిపించింది. వారూ వీరూ కూడూ దూకుడు చేశారు. మొత్తానికి చూస్తే ఎన్నికల ప్రచార పర్వం ఎన్నడూ చూడని విధంగా సాగి ముగిసింది. ఇక శనివారం సాయంత్రం ఆరు గంటల తరువాత మైకులు మూగబోయాయి. ఒక విధంగా చూస్తే నిశ్శబ్దం ఆవరించింది. అంతా గప్ చుప్ అన్నట్లుగా ఉంది. ఏపీ రాజకీయం అంత గుంభనంగా ఉన్న వేళ పోలింగ్ కి సర్వం సిద్ధం అవుతోంది.