దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ప్రారంభం.. దీని ప్రత్యేకతలెన్నో!
అరేబియా సముద్రంలో నిర్మించిన 2.3 కిలోమీటర్ల పొడవున్న తీగల వంతెనకు సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు.
By: Tupaki Desk | 25 Feb 2024 5:05 AM GMTదేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ప్రారంభమైంది. గుజరాత్ లోని ద్వారకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీగల వంతెనను ప్రారంభించారు. అరేబియా సముద్రంలో నిర్మించిన 2.3 కిలోమీటర్ల పొడవున్న తీగల వంతెనకు సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బైట్ ద్వారకతో కలుపుతుంది.
గుజరాత్ లోని సుప్రసిద్ధ యాత్రా స్థలం.. ద్వారకలోని ద్వారకాదీశ్ (శ్రీకృష్ణుడు) ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఈ తీగల వంతెన చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.
కాగా ఒకప్పటి శ్రీకృష్ణుడి రాజధాని నగరమైన ద్వారకకు ఓఖా పోర్టు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి బైట్ ద్వారకలో ఉన్న ద్వారకాదీశ్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు చేయనున్నారు. అంతకుముందు మోదీ ద్వారకలో శ్రీకృష్ణ ఆలయంలో పూజలు నిర్వహించారు.
ఈ తీగల వంతెన నిర్మాణానికి మొత్తం రూ.979 కోట్లు వ్యయం చేశారు. 2017 అక్టోబర్ లో ప్రధాని మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది. మొత్తం 27.20 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో నిర్మించిన తీగల వంతెనపై 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్ పాత్ ను నిర్మించారు.
తీగల వంతెన రెండు వైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలను ఉంచారు. అంతేకాకుండా ఈ వంతెనకు మరెన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ వంతెనపై పలు చోట్ల సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసి ఒక మెగావాట్ సౌర విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. సుదర్శన్ సేతు దేశంలోనే అతిపొడవైన సిగ్నేచర్ బ్రిడ్జిగా నిలిచింది.
కాగా గుజరాత్ (రాజ్ కోట్), ఆంధ్రప్రదేశ్ (మంగళగిరి), పంజాబ్, ఉత్తరప్రదేశ్ లో నూతనంగా నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. వీటి నిర్మాణానికి కేంద్రం రూ.6,300 కోట్లు వెచ్చించింది.
ఇటీవల తిరుపతిలోని ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, విశాఖలోని ఐఐఎం తదితర సంస్థలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయోధ్యలో రామ మందిరంలో తొలి పూజలు చేసి రామ్ లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ ఇప్పుడు హిందువులకు మరో ఆరాధ్యనీయ స్థలమైన ద్వారకలో తీగల వంతెనను ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది.